కోడి పందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి…

Sakshitha news

కోడి పందేల స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి…

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు….

–సీపీ అంబర్ కిషోర్ ఝా…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, మంచిర్యాల/ : కోడి పందేల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి 16 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.24,040 నగదు, 4 కోళ్లు, 45 కత్తులు, 18 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై రమేష్, నీల్వాయి ఎస్సై నాగరాజు, సిబ్బంది అర్ధరాత్రి వేమనపల్లి మండలం కల్లెంపల్లి గ్రామ శివారులో దాడి నిర్వహించారు. కోడి పందేల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో పట్టుబడిన 16 మందిని, స్వాధీనం చేసుకున్న నగదు, కోళ్లు, కత్తులు, వాహనాలు, మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నీల్వాయి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు కోడి పందేలు, జూదం, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు స్థావరాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం లేదా వాటికి సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీపీ సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

పోలీసుల హెచ్చరికతో అక్రమ బెట్టింగ్ నిర్వాహకుల్లో కలకలం.. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా

Scroll to Top