కామ్రేడ్ మధుసూదన్ రాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి….
— ఐఎఫ్‌టీయూ…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : ఐఎఫ్‌టీయూ వ్యవస్థాపక సభ్యులు కామ్రేడ్ మధుసూదన్ రాజ్ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని తిలక్‌నగర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఘనంగా వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ నివాళులు అర్పించారు.
సభలో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు కె. విశ్వనాథ్ మాట్లాడుతూ, కామ్రేడ్ మధుసూదన్ రాజ్ కార్మిక వర్గ పోరాటాల్లో చిరస్మరణీయ నాయకుడని కొనియాడారు.
గోదావరిలోయలో ప్రారంభమైన ప్రతిఘటన పోరాట జ్వాలలను డూన్ లోయతో పాటు ములుగు అటవీ ప్రాంతాలకు విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డికి కుడిభుజంగా నిలిచి విప్లవ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని అన్నారు.
భోపాల్ విషవాయు ఘటన అనంతరం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు పిలుపునిస్తూ వాటికి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ప్రజా పోరాటాల విస్తరణలో భాగంగా సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, 1995 జూలై 26న హైదరాబాద్‌లోని అశోక్‌నగర్–అరుంధతి నగర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను హత్య చేసిందని ఆరోపించారు.
కామ్రేడ్ మధుసూదన్ రాజ్ ఆశయాల సాధన కోసం కార్మిక, ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని, బలమైన విప్లవ కార్మిక ఉద్యమ నిర్మాణమే ఆయనకు అందించే నిజమైన విప్లవ నివాళి అని విశ్వనాథ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు దాముఖ లక్ష్మణ్, జిల్లా నాయకులు ఇ. రాజేందర్, యతిరాజు శ్రీనివాస్, భూసిపాక దేవన్న, ఐలయ్య, మహిపాల్ రెడ్డి, ఆనంద్, ఇల్లేందుల ముత్తన్న, ఇ. రాయపోచన్న, రమేష్, పీఓడబ్ల్యూ నాయకురాళ్లు తిరుమల, భూసిపాక సుశీలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
