వట్టే జానయ్య యాదవ్‌పై ఆరోపణలు రాజకీయ కక్షసాధింపే: టీఆర్‌పీ

Sakshitha news

వట్టే జానయ్య యాదవ్‌పై ఆరోపణలు రాజకీయ కక్షసాధింపే: టీఆర్‌పీ

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

సూర్యాపేట, : తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్‌ను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేయిస్తోందని టీఆర్‌పీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వట్టే జానయ్య యాదవ్‌కు చెందిన వజ్ర రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన పేర్కొన్నారు. స్థానిక అడిషనల్ కలెక్టర్‌కు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈ దాడులు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

ఇటీవల మూడు రోజులుగా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ₹69 కోట్ల ధాన్యం స్కామ్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.69 కోట్ల స్కామ్ జరిగిందని చెబుతుంటే, అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లేదా ధాన్యం వివరాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో విఫలమైందని విమర్శించారు. వజ్ర రైస్ మిల్లులో వడ్లు, బియ్యం అక్రమంగా విక్రయించారంటూ నమోదు చేసిన కేసులు, జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని అన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వట్టే జానయ్య యాదవ్‌కు పేరు ఉందని, ఆయన పరారీలో ఉన్నారనే ప్రచారం కూడా దుష్ప్రచారమేనని కొట్టిపారేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాలను ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నందునే వట్టే జానయ్య యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా అధికార పార్టీతో కుమ్మక్కై ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజా జీవితంలో ఉన్న ఒక నాయకుడిపై జరుగుతున్న ఈ రాజకీయ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోనే మంజుల గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top