నార్కట్‌పల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం
షార్ట్‌సర్క్యూట్‌తో దుకాణాలు దగ్ధం
లక్షల్లో ఆస్తి నష్టం
సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో
నల్గొండ జిల్లా,నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో నంది విగ్రహం సమీపంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సమీపంలోని తాత్కాలిక దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. మంటలు క్షణాల్లోనే ఉద్ధృతంగా మారడంతో సుమారు 10 నుంచి 15 దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చి చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు కూడా వ్యాపించాయి. భారీ శబ్దాలతో సిలిండర్లు పేలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఆస్తి నష్టం వివరాలపై అధికారులు విచారణ చేపట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
