కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కల్యాణి డ్యామ్ నందు నీటి మాట్టాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. కళ్యాణి డ్యామ్ 900 ఎం.సి.ఎఫ్.టి. సామర్థ్యం కలిగి ఉందని, ప్రస్తుతం 310 ఎం.సి.ఎఫ్.టి. ల నీటిమట్టం ఉందని, ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో తదితర విషయాలను ఇంజినీరింగ్ అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న నీరు ఆరు, ఏడు నెలల వరకు సరఫరా అయ్యే అవకాశం ఉందని అన్నారు. వర్షపునీరు పెద్ద ఎత్తున కల్యాణి డ్యామ్ కు చేరితే ప్రజలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కళ్యాణి డ్యామ్ నుండి నీరు సరఫరా అయ్యే పైప్ లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడ నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ మరమ్మత్తులు ఉంటే చేయించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ. మధుకుమార్, తదితరులు ఉన్నారు.