సాక్షిత : * తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు సారె సమర్పించే కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుందని, నగరపాలక సంస్థలోని అధికారులు, సిబ్బంది అందరూ సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. శుక్రవారం సారె సమర్పణ కార్యక్రమ ఏర్పాట్లపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో విభాగ అధిపతులతో గురువారం సాయంత్రం ప్రత్యేక సమావేశం జరిగింది. అధికారులకు కమిషనర్ హరిత ఐఏఎస్ సూచనలు చేస్తూ గంగమ్మకు భక్తి శ్రద్దలతో సారె సమర్పించేలా అన్ని ఏర్పాట్లను పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. సారె సమర్పణలో పాల్గొనే కళాకారులకు, భక్తులకు త్రాగునీరు, మజ్జిగ అందుబాటులో వుండేలా పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు.
కళాకారులకు రోడ్డుపై నడిచేటప్పుడు కాళ్ళు కాలకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని పిచికారి చేయించాలన్నారు. సారె సమర్పణలో పాల్గొనే మన సిబ్బందిలో వేషాలు వేసుకొనే వారి కోసం గంధం, కుంకుమ, బొగ్గుపొడి, రిబ్బన్లను అందుబాటులో వుండేలా చూడాలన్నారు. పోలీసుల సహకారం తీసుకొని మన నగరపాలక సంస్థ సారె ఊరెగింపును చక్కగా ట్రాఫిక్కు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా గంగమ్మ ఆలయ అధికారులకు సారె తీసుకొస్తున్న విషయాన్ని తెలియబరచాలన్నారు. సారె తీసుకెల్లె రిజర్వాయర్ రోడ్డు, ఓల్డ్ మెటర్నరిటి రోడ్, భవాని నగర్ జంక్షన్, వివి మహాల్ రోడ్, ఓల్డ్ మునిసిపల్ కార్పొరేషన్ సర్కిల్, తుడా సర్కిల్ ప్రాంతాల్లో శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ సమర్పించే గంగమ్మ సారె సమర్పణకు అందరూ సహకరించి, పాల్గొనాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ స్పష్టం చేసారు. ఈ సమిక్షా సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీరు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, ఫైర్ ఆఫిసర్ శ్రీనివాసరావు, ఎగ్జామినర్ రామచంధ్రా రెడ్డి, సెక్రటరీ రాధిక, ఏసిపిలు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, సంజీవ్ కుమార్, గోమతి, మెప్మా కృష్ణవేణి, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు