సాక్షిత : తిరుపతి అభివృద్దికి మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రారంభించడం అత్యవసరమని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ దామలచెరువు హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో నిర్మితమవుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల స్థితిగతులపై నగరపాలక సంస్థ కార్యలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ప్లానింగ్ అధికారులతో కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నగరం విస్తిరణకు అవసరమైన సరైన రోడ్లు రాకపోవడంతో, సరైన రీతిలో అభివృద్ది జరగలేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆమోదంతో తిరుపతి నగరంలో అవసరమైన 13 మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరిగిందన్నారు.
నగరాలు అభివృద్ధి చెందాలంటే రహదారుల నిర్మాణాలు అభివృద్ది చెందాలనే దృక్పదంతో పని చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన అన్నమయ్య మార్గం, వై.ఎస్.ఆర్ మార్గం, సామవాయి మార్గం మాస్టర్ ప్లాన్ రోడ్ల గురించి ఉదాహరిస్తూ నేడు ఆ మార్గాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయన్నారు. అనేక సంవత్సరాల నుండి అభివృద్దికి నోచుకోని కోర్లగుంట ప్రధాన రోడ్డు విస్తరణతో ఆ ప్రాంతం రాకపోకలకే కాకుండా ఏరియా అభివృద్దికి మూలం అవుతుందన్నారు. మే మొదటి వారంలో జరగనున్న తిరుపతి గంగమ్మ జాతరకు గంగమ్మగుడి వద్ద నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్డును పూర్తి చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు అమలు అవుతున్న ప్రాంతాల్లోని స్థలాలు ఇచ్చిన వారికి త్వరగా టిడిఆర్ బాండ్లను అందించేందుకు, అదేవిధంగా లీగల్ సమస్యలు వుంటె సకాలంలో పరిష్కరించేలా చూడడం చేయాలన్నారు. అనుకున్న సమయంలోనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసి తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చే భాధ్యత మనందరిపై వుందని కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేసారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకటరామి రెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, దేవిక, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం పాల్గొన్నారు.