టీటీడీలో “సివిల్ సర్వీసెస్ డే” సంబరాలు
** ఉన్నతాధికారుల ఆత్మీయ సమ్మేళనం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టమని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జాతీయ పౌర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు వి. వీరబ్రహ్మం, డా. ఎ. శరత్, సివిఎస్వో కె.వి.మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తులకు ఆధ్యాత్మిక భావంతో పాటు సమిష్టి భావనతో ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ సంబంధించినదని తెలిపారు. అందరూ స్వయం అనుభూతితో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం – ప్రజల మధ్య ఉద్యోగులు వారధిలా ఉంటారని చెప్పారు. చట్ట పరిపాలన సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతా యని చెప్పారు. పరస్పర సహకారంతో, సమూహంగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అలాగే, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడితే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని, వీలైనంత వరకు తెలుగులోనే భావ వ్యక్తీకరణ చేయాలని సూచించారు. టీటీడీలో మొదటిసారి జాతీయ పౌర దినోత్సవాన్ని ఉద్యోగుల మధ్య నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ క్షేత్ర స్థాయి అనుభవాలను వినియోగించుకుంటూ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు.
అభిప్రాయాల సేకరణ విధానం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.
నిరంతరం శిక్షణ అవసరమని, మంచి ఫలితాల కోసం జ్ఞానం తో పాటు అనుభవం కూడా అవసరమని అన్నారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుంటూ నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ టి.వి.సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, కస్తూరిబాయి, రాజేంద్ర కుమార్, ఉద్యోగ సంఘాల నాయకులు గోల్కొండ వెంకటేశం, ఆంజనేయులు, కట్టమంచి ఇందిర, జాటోత్ భాస్కర్, కాటా గుణశేఖర్, ప్రసాద్, చీర్ల కిరణ్, గంపల వెంకట రమణారెడ్డి, కల్పన, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY