ప్రమాదాలు లేని జిల్లాగా చేయడమే లక్ష్యం

Sakshitha news

ప్రమాదాలు లేని జిల్లాగా చేయడమే లక్ష్యం

** రోడ్డు ప్రమాదాల నివారణకు నడుం బిగించిన ఎస్పీ, కలెక్టర్

** బ్లాక్ స్పాట్స్ పరిశీలనకు బస్సుయాత్ర ప్రారంభం
….

తిరుపతి: తిరుపతిని
ప్రమాదాలు లేని జిల్లాగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. జీరో డెత్ పాలసీ లక్ష్యంగా 2–3 నెలల్లో 100శాతం సరిదిద్దే చర్యల సన్నాహక చర్యల్లో భాగంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సహకారంతో స్థానిక అర్బన్ హాట్ వద్దనుంచి బస్సుయాత్ర ప్రారంభం అయింది. ఈ బృహత్తర కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో చేపట్టి ప్రత్యక్ష పరిశీలన, తక్షణ, శాశ్వత పరిష్కారాలు అంశాలు టార్గెట్ గా కృషి చేస్తున్నట్లు ఎస్పీ, కలెక్టర్ ప్రకటించారు. బస్సు ప్రారంభంలో అధికారులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా 48 బ్లాక్ స్పాట్ల గుర్తింపు – తక్షణ సవరణ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు కఠిన చట్ట అమలు ద్వారా ప్రమాదాల తగ్గింపు రోడ్డు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా యంత్రాంగం బస్సు యాత్ర చేపట్టిందని తెలిపారు.


జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంగా ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ముందున్నాయని తెలిపారు. తిరుపతి జిల్లాలో ప్రతి సంవత్సరం సగటున 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల దర్శనానికి పెరుగుతున్న భక్తుల రాక, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం లోపం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ వంటి కారణాల వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని వివరించారు. గత సంవత్సరంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాంతక ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాలను పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి ప్రత్యేక బస్సుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్షంగా పరిశీలించామని చెప్పారు.


ప్రతి ప్రాంతంలో రహదారి లోపాలు, నిర్మాణ సమస్యలు, స్థానిక పరిస్థితులను విశ్లేషించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు.
జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100 శాతం సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికుల కోసం తగిన రెస్ట్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ నియంత్రణకు ఆల్కహాల్ మీటర్లు, స్పీడ్ గన్స్ వినియోగాన్ని పెంచుతున్నామని వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఒకవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ భావోద్వేగంగా మాట్లాడుతూ “రోడ్డు ప్రమాదాలు కేవలం సంఖ్యలు కావు… అవి కుటుంబాల బాధలు. ప్రతి బ్లాక్ స్పాట్‌ను సరిచేయడం అంటే ఒక కుటుంబాన్ని రక్షించినట్లే. భద్రతపై అప్రమత్తతే నిజమైన రక్షణ. అని అన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే ప్రాణ నష్టాలను నివారించగలం” అని తెలిపారు. వాహనదారులు స్వయంగా క్రమశిక్షణతో ఉండి, ఓవర్ స్పీడ్ చేయకుండా, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రహదారి ఇంజనీరింగ్ పరంగా సరైన సూచికలు, వేగ నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. తిరుపతి జిల్లాకు వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు అందరూ రహదారి భద్రతపై అప్రమత్తంగా ఉండి, అనవసర ప్రాణ నష్టాలను నివారించేందుకు అధికారులు, మీడియా, ప్రజలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.

Scroll to Top