SAKSHITHA NEWS

రవీంద్రభారతి లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
స్థానిక కుర్మన్నపాలెం రవీంద్రభారతి పాఠశాలలో
బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇది పిల్లలను ఉత్సాహపరచడానికి, వారిని గౌరవించటానికి అంకితం చేసిన రోజు. పిల్లలను ఎంతో ప్రేమించే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం ఈ బాలల దినోత్సవం మనమందరం వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజున ప్రతి పిల్లలకు ప్రేమ, గౌరవం, వారు భవిష్యత్తులో ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని,వారి కలలను నిజం చేసేందుకు పెద్దలుగా మన వంతు సాయాన్ని చేయాలని,బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని,సమాజంలో పిల్లల ప్రాముఖ్యతను చెప్పే సందర్భమని ,ఈ దేశ భవిష్యత్తు మీ మీదే ఆధారపడివుందని తెలియజేస్తూ,మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు మరియు నా ఆశీస్సులు అని రవీంద్రభారతి పాఠశాలల చైర్మన్ యం.యెస్.మణి అన్నారు.ప్రతి ఏడాది నవంబర్ 14న ఈ దేశానికి పిల్లలే పునాది అని నమ్మిన మన మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను మనం స్మరించుకుంటాము. పిల్లలు వికసించాల్సిన మొగ్గలని జవహర్ లాల్ నెహ్రూ నమ్మేవారు.

అందుకే వారికి సురక్షితమైన, సంతోషకరమైన భవిష్యత్తును ఇవ్వాలని వారు ఆనందకరమైన వాతావరణంలో పెరగాలని ఆయన భావించేవారు. అందుకే పిల్లల కోసం ఆయన జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా మార్చారు. నా ప్రియమైన చిన్నారులకు నేను చెప్పేది ఒకటే… ఈ ప్రపంచం మీ కోసం ఎన్నో అవకాశాలను దాచి ఉంచింది. మీరు మీ భవిష్యత్తును ఈ దేశంలో ఎంతో చక్కగా నిర్మించుకోగలరు. ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం పెద్దలంతా పనిచేయాలని కోరుకుంటున్నాను అని నార్త్ ఆంధ్రా జోనల్ ఇంచార్జ్ యన్.వెంకటేష్ అన్నారు.పిల్లలకు ఈ బాలల దినోత్సవం ఎంతో ముఖ్యమైనది.పిల్లలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎదగడానికి, నేర్చుకునే సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. నేటి పిల్లలే రేపటి దేశానికి నిజమైన శక్తి రూపాలు. వారికి విద్య అవకాశాలు సృష్టించాల్సిన బాధ్యత నేటి పెద్దలకు ఉంది. ప్రతి బిడ్డ కలలు కనే ప్రపంచాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటు న్నాను అని నార్త్ ఆంధ్ర సీ.జీ.యం జి.ఆర్.వసంత , జి.యం రమ్య అన్నారు.మీరంతా పెద్దగా కలలు కనండి. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి.

ఆసక్తిని, ఏకాగ్రతను ఏమాత్రం విడనాడకండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి నేటి పిల్లలు రేపటి పౌరులైన మీకే ఉంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. నేటి పిల్లలను పోషించే, రక్షించే బాధ్యత మీదే. మీరు ఆ వాగ్దానాన్ని మాకు ఇవ్వాలి. బాలల దినోత్సవం అనేది పిల్లల కలలకు మద్దతు ఇవ్వడమే, వారిని కాపాడటమే, వారి జీవితాలకు అవకాశాలతో నిండిన భవిష్యత్తును మార్గదర్శకత్వం చేయడమే.ఈ బాలల దినోత్సవంనాడు పిల్లలందరినీ నేను ఒకటే కోరుతున్నాను… మీరు ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని,అభిమాన,ఆప్యాయతలను,ప్రేమానురాగాలను కలిగి ఉండాలని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జయశ్రీ అన్నారు.కార్యక్రమములో చిన్నారులు,విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.


SAKSHITHA NEWS