SAKSHITHA NEWS

శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వేళల్లో మార్పు

సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో బుకింగ్ కౌంటర్లు.

దూర ప్రాంతాల ప్రయాణికుల విన్నపం మేరకు నూతన టైమ్ టేబుల్……వికారాబాద్ సెక్షన్ రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి వెల్లడి.

శంకర్‌పల్లి: ఆగస్టు 30:శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి వేళలు మారుస్తున్నట్లు వికారాబాద్ సెక్షన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగేవి. వివిధ వర్గాల ప్రజలు, బిడిఎల్, ఓడిఎఫ్ సంస్థల ఉద్యోగులు, స్థానికులు అభ్యర్థనల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పని వేళలు మారుస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. తాజాగా రేపటి నుండి నూతన వేళలు అమల్లోకి వస్తాయని, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రిజర్వేషన్ల గురుంచి తెలుసుకొని సహకరించాలని కోరారు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ కౌంటర్ తెరిచి ఉంటుందని, మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుందన్నారు. అదేవిధంగా గతంలో లాగే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రిజర్వేషన్ కౌంటర్ తెరిచి ఉంటుందని సిఐ తెలిపారు. అదే విధంగా తత్కాల్ మాత్రం గతంలో లాగే ఏసీ తరగతుల్లో బుకింగ్ 10 గంటల నుండి, నాన్ ఏసీ స్లీపర్ బుకింగ్ 11 గంటల నుండి ప్రారంభం అవుతుందని శంకర్ పల్లి రైల్వే స్టేషన్ రిజర్వేషన్ సూపర్వైజర్ రవీందర్ పేర్కొన్నారు.


SAKSHITHA NEWS