పుట్టినరోజు సేవగా మార్చిన దంపతులు, నిరుపేద కుటుంబానికి అండగా చంద్రపాల్-నీనా మార్గరెట్…
ఆర్భాటాలకు బదులు మానవతా స్పూర్తి 25 కిలోల బియ్యం, నిత్యావసరాల పంపిణీ….
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా కాకుండా సేవగా మార్చి, నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన చంద్రపాల్-నీనా మార్గరెట్ దంపతుల చర్య అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
సోమవారం చంద్రశేఖర్ నగర్‌కు చెందిన పోతుల నీనా మార్గరెట్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె భర్త సింగరేణి విశ్రాంత ఉద్యోగి చంద్రపాల్ కుటుంబ సభ్యులతో కలిసి, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంగానగర్‌లో నివసిస్తున్న లారీ డ్రైవర్ మమతగిరి సతీష్ కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, స్వీట్లు అందజేశారు.
గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాళ్లు పనిచేయక పడకకే పరిమితమైన సతీష్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న చంద్రపాల్, తన సతీమణి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సహాయం అందించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పుట్టినరోజులను ఆర్భాటంగా జరుపుకోవడం కంటే ఇలాంటి మానవతా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆదుకునే కార్యక్రమాలకు ఇది స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
అలాగే ముత్తారం మండలం సీతంపేట సర్పంచ్‌గా ఎన్నికైన గంగానగర్ వాసి ఇండ్ల కృష్ణవేణిని ఈ సందర్భంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నీనా మార్గరెట్, చంద్రపాల్ కుటుంబ సభ్యులు జాన్ ఈవెన్, శాంతి నిరీక్షణ, జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు, సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, మేజిక్ రాజా, హరి, అంజన్న, బోడకుంట వెంకట్రాజం, వెంకటలక్ష్మి, తిరుపతి, సిద్ధూ, సతీష్ భార్య ఉమ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY