నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం…
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకుంటున్న లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష రాయలేకపోతున్నాననే ఆవేదనతో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని ఆయన అన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోయే పరిస్థితులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు నీట్ పరీక్షలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, తల్లిదండ్రులు అప్పులు చేసి, పొలాలు అమ్ముకుని తమ పిల్లలను నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యాసంస్థల్లో చదివిస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని, యువతను తప్పుదోవ పట్టించే విధానాలకు స్వస్తి పలికి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో విద్యార్థులను, వారి కుటుంబాలను కలిసి వారికి ధైర్యం చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు.
నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాను ఎమ్మెల్యేగా తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, బాధిత కుటుంబాలకు అండగా నిలవడం సమాజం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
