అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవు….
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టే లక్ష్యంగా ‘ఆపరేషన్ చబుత్రా’.. 30 మంది యువకుల అదుపులోకి, రెండు బెల్ట్ దుకాణాలపై కేసులు….
సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ‘ఆపరేషన్ చబుత్రా’ నిర్వహించారు.
గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అర్ధరాత్రి విస్తృతంగా గస్తీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, వీధులు, రహదారుల్లో గుంపులుగా తిరుగుతున్న యువకులు, మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై సంచరిస్తున్న వారు, అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో 30 మంది యువకులను, వారి ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని మద్యం సేవించి వాహనం నడిపారా అనే పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడి పట్టుబడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గంజాయి స్థావరాలు, బెల్ట్ దుకాణాలపై నిఘా
‘ఆపరేషన్ చబుత్రా’లో భాగంగా గంజాయి వినియోగం, విక్రయానికి అవకాశం ఉన్న ప్రాంతాలు, బెల్ట్ దుకాణాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తనిఖీల్లో రెండు బెల్ట్ దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
ప్రజలకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రశాంతమైన, సురక్షిత వాతావరణం కల్పించేందుకు నిరంతరం గస్తీ, రాత్రి తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.
రాత్రి 10 తర్వాత అప్రమత్తం, రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై విన్యాసాలు చేస్తూ లేదా గుంపులుగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని, అవసరమైతే వాహనాలను స్వాధీనం చేసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలపై దృష్టి సారించి, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని ఏసీపీ ఎం. రమేష్ పిలుపునిచ్చారు. రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐలు మనోహర్, సంధ్య, అంతర్గం ఎస్‌ఐ వెంకటస్వామితో పాటు పోలీస్‌స్టేషన్, ప్రత్యేక బృందాల సిబ్బంది పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST