తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు
** నిందితున్ని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు
** 18.5 లక్షల నగదు, 126 గ్రాముల బంగారు స్వాధీనం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఇళ్లకు తాళాలు వేసి ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్పీ (క్రైమ్స్) వివరాలు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు ఢిల్లీకి చెందిన ఉల్కెష్ గా గుర్తించారు. నిందితుడు గత కొంతకాలంగా విలాసాలకు బానిసై, తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లో ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయాలను గమనించి, తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, అనుమానితుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు 2024 సంవత్సరంలో తిరుపతి నగర పరిధిలో మొత్తం ఆరు చోరీ కేసులకు పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుంచి మొత్తం రూ18.5 లక్షల నగదు, 126.135 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో బంగారు గొలుసులు, ఉంగరాలు, బంగారు చైన్లు, లక్ష్మీ డాలర్ చైన్, చెవిపోగులు, ఇతర బంగారు వస్తువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఈ నేరాలకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు.
ముఖ్యంగా అదనపు ఎస్పీ (క్రైమ్స్) పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది సమన్వయంతో వేగంగా దర్యాప్తు నిర్వహించి కేసును విజయవంతంగా ఛేదించారు.
అప్రమత్తంగా ఉండాలి
ప్రజలు తమ ఇళ్లను కొంతకాలం ఖాళీగా వదిలి వెళ్లే సందర్భాల్లో పొరుగువారికి సమాచారం ఇవ్వడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లేదా పోలీసువారికి సమాచారం ఇచ్చిన ఎల్.హెచ్ఎంఎస్ కెమెరాలను ఉచితంగా ఏర్పాటు చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని… లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
