ఎమ్మెల్యే గ్రీవెన్స్ లో రెవెన్యూ సమస్యలే ఎక్కువ
సాక్షిత ప్రతినిధి – శ్రీకాళహస్తి / తిరుపతి: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సమస్యలే ఎక్కువ అందాయి. ఈమేరకు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్‌లో ప్రజా విన్నపాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా వచ్చిన అర్జీలలో అధిక శాతం రెవెన్యూ సమస్యలే ఉండటం గమనార్హం. గత వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం భూ రికార్డులను తారుమారు చేసి, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ రెవెన్యూ గందరగోళం వల్ల నేడు సామాన్యులు తమ సొంత భూముల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందిన ప్రతి విన్నపాన్ని నిశితంగా పరిశీలించి, చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతిని ప్రక్షాళన చేసి, పారదర్శకమైన పాలనను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
