కాలేశ్వరాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న బీఆర్ఎస్….

Sakshitha news

కాలేశ్వరాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న బీఆర్ఎస్….

ఎన్డీఎస్ఏ నివేదికల మేరకే ప్రభుత్వం ముందుకెళ్తోంది: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి. కరీంనగర్, కాలేశ్వరం ప్రాజెక్టును కరువు సమస్యతో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆరోపించారు. కరీంనగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేటీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ వరుస వైఫల్యాలే ఆయన రాజకీయ తీరు వెల్లడిస్తున్నాయని అన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు కాలేశ్వరం ప్రాజెక్టును బాగు చేసేందుకు మరో మూడు నెలలు మంత్రి పదవి ఇవ్వాలని కోరడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు వెలుగుచూశాయని, నిర్మించిన మూడు బ్యారేజీలు గ్యారేజీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నుంచి నీటిని ఎత్తిపోసే విషయంలో అధికారిక ఇంజినీరింగ్ నిపుణుల సూచనలు, ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల మేరకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. భద్రతా కారణాల వల్లే ప్రస్తుతం నీటిని ఎత్తిపోయడం లేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, ఎల్‌ఎండీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికీ రైతులకు జీవనాధారంగా నిలిచాయని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు కాలేశ్వరం పేరుతో మొసలి కన్నీళ్లు కారుస్తోందని విమర్శించారు.

ఎన్డీఎస్ఏ తదుపరి నివేదికల ఆధారంగానే ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయాలు తీసుకుంటుందని విజయరమణ రావు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top