SAKSHITHA NEWS

చల్లా వంశీ చంద్ రెడ్డే టార్గెట్

వన్నె తగ్గిన “మన్నె” – వ్యూహా రచనలో “డికే”

మారుతున్న పాలమూరు పార్లమెంటు రాజకీయం..!

బీఆర్ఎస్, బిజెపిలను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్న “కాంగ్రెస్”

మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో కొత్త డ్రామా..

కాంగ్రెస్, బిజెపిల మధ్యే ప్రధాన “వార్”

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాలమూరులో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా మారుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ ఢీ అంటే ఢీ అంటున్నారు. మరోవైపు వన్నె తగ్గిన గులాబీ పార్టీలో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చిన్నబోయింది. ఎందుకు ఏమిటి ఎలా? అని ఆరా తీస్తే గులాబీ వ్యూహం ఇప్పుడిప్పుడే ఊహకు అందుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పట్టుకొల్పోయిన గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి జాడ మాత్రం కనిపించడం లేదు. ఎంపీగా ఉన్న సమయంలోనే “అదృశ్య శక్తి”గా ఉన్న మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు కనీసం ప్రచార సమయంలో కూడా అదే అదృశ్య శక్తి పాత్రను పోషిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం పాలమూరు పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ మనుగడ కోల్పోయింది. మొన్నటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యక్ష రాజకీయ ప్రణాళిక అనుమానాస్పదంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మౌనం ఆవహించిన గులాబీ దళం ఏం చేయాలో పాలు పోక ప్రస్తుతం “బృహన్నెల”లా రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. శత్రువును దెబ్బతీయడం కోసం తన వంతు పాత్ర సైలెంట్ గా పోషించి లబ్ధి పొందేందుకు వ్యూహం రచిస్తున్నారన్నది పాలమూరు విశ్లేషకుల అభిప్రాయం.

ఏం జరుగుతోంది..?

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన గులాబీ పార్టీ నేడు గడ్డు పరిస్థితిని
ఎదుర్కొంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన ఆ పార్టీకి ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో ఆదరణ తగ్గింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లో విజయభేరి మోగించిన ఆ పార్టీ 2023 ఎన్నికల్లో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే నిలబెట్టుకుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి రాజకీయం రంజుగా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి బిజెపి బిఆర్ఎస్ టార్గెట్ గా మారిపోయారు. దీంతో బీఆర్ఎస్, బిజెపి పార్టీలు తెరవెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన నారాయణపేట సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ఓటమి కోసం బీఆర్ఎస్, బిజెపిలు రెండు కుమ్మక్కయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో నిజం లేకపోలేదు. పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు ఇద్దరి మధ్యలో మూడవ వాడికి లాభం చేకూరవద్దనే విధంగా బిజెపి, బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఒక నిర్ణయాత్మక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలిచేది లేదని తేలడంతో అంతర్గతంగా మౌనం వహించి అధిష్టానం నిర్ణయంతో పాలమూరులో బిజెపికి బలం చేకూరే విధంగా పాచికలు కదుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. పాలమూరులో గులాబి ఓట్లు చీలకుండా పకడ్బందీ ప్రణాళికతో బిజెపికి ఓట్లు మార్పిడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేస్తే బిజెపికి నష్టం జరిగే అవకాశాలు ఉండడంతో ప్రేక్షక పాత్ర వహించి ప్రచారం చేయకుండా నామమాత్రంగా వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకు సైలెంట్ గా బిజెపికి మారుతుందని అంచనా. ఈ వ్యూహంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓటమి కోసం గులాబీ, కమలం పార్టిలు సర్వ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారాలపట్టి కవిత తీహార్ జైల్లో ఉండడం, ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపితో పెట్టుకుంటే మరింత కష్ట సాధ్యం అవుతుందన్న ఆలోచనా ధోరణితో తెలంగాణలో ఐదు పార్లమెంటు స్థానాల్లో బిజెపి గెలిచే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట సభలో వెల్లడించారు.

వన్నె తగ్గిన మన్నే..

గులాబి పార్టీకీ ఇంతటి ఘోర పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఎమ్మెల్యేల అవినీతి భూదందాలు అహంకారం పోలీసు వ్యవస్థను ఉపయోగించి సామాన్యులపై విరుచుకుపడ్డ తీరుతో గులాబీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచింది. పోనీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకుంటుందా అంటే ఆలోచిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి కుడా కనిపించడం లేదు. ఎందుకంటే మన్నె శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ ప్రచారంలో దూసుకుపోలేదు. అటు అభ్యర్ధి రంగంలోకి రాక ఇటు ఆయన గెలుపు కోసం ఆయా అసెంబ్లీలలో మాజీ ఎమ్మెల్యేలు ముందుకు రాక అయోమయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఎలాగో గులాబీ పార్టీకి ఓటు వేస్తే వచ్చేది లేదు చచ్చేది లేదు అదేదో బిజేపి పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని భావంతో దానికి ఓటు వేసి తమ ఓటుకు ప్రయోజనం చేకూర్చుకుందాం అనే ధోరణితో గులాబీ శ్రేణులు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మైనార్టీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో బిజెపికి పడవు అన్నది నగ్నసత్యం. అదేవిధంగా మిగతా వర్గాల ఓట్లను బిజెపికి మళ్లించడానికి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అంతర్గత పొత్తు కుదుర్చుకుంది అన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఎంపీగా ఉన్నన్ని రోజులు శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో తిరిగిన దాఖలాలు లేవు. పెద్దగా ఆయన పార్లమెంటుకు ప్రయోజనం చేకూర్చింది కూడా ఏమీ లేదు. మొక్కుబడిగా ఏదో ఎంపీగా ఉన్నామా అంటే ఉన్నాం అనే అపఖ్యాతి శ్రీనివాస్ రెడ్డి మూట కట్టుకున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4,11, 402 ఓట్లు తెచ్చుకొని మొదటి స్థానంలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల్లో మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదని అంటున్నారు.

వ్యూహాత్మకంగా “డీకే”

ఎంతో రాజకీయ పరినితి చెందిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఈ ఎన్నికల్లో పూర్తిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. రోజుకూ 18 గంటలు ఆమె ప్రచారానికి వెచ్చిస్తున్నారు. బిజెపిలో కార్యకర్తల చేరిక సంఖ్య కూడా రోజురోజుకు మెరుగుపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ జిల్లాలో ఘోరంగా దెబ్బ తినడమే బిజెపికి కలిసి వచ్చే అంశంగా ఆమె భావిస్తున్నారు. అధికార పార్టీలోకి వెళ్లలేని వారు ప్రస్తుతం డీకే అరుణను మాత్రమే నమ్ముకొని ఆ పార్టీలో చేరుతున్నారు. అధికార పార్టీలో ఉన్న నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, రాజకీయ పట్టింపులు డీకే అరుణకు లాభం చేకూర్చే అంశంగా మారుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అటు తమ రాజకీయ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా దానిని డీకే అరుణకి ఓటు వేయాలన్న నిర్ణయానికి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు.
ప్రస్తుతం డీకే అరుణ ఈ ఎన్నికల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. మరోవైపు అయోధ్య అంశం, మోడీ చరిష్మా ఆమెకు ఈ ఎన్నికల్లో లాభం చేకూర్చే అంశాలుగా కుడా చెప్పవచ్చు.

వంశీకి సర్వం “రేవంత్ రెడ్డే”

ఈ ఎన్నికల్లో ప్రధానంగా చర్చించుకోవాల్సిన వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. పైగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖా కావడం ఆయన నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేటలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టి తన వ్యూహాన్ని చాటారు. ప్రభుత్వాన్ని అధిష్టించి ఎక్కువ రోజులు కాకపోయినా వరుసగా పాలమూరు జిల్లాలో ఎన్నికలను రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ముందుగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ఆ పార్టీ ఎదుర్కొంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పోరు లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడ్డాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ బిజెపి, కాంగ్రెస్ మాత్రమే గట్టి పోటీ ఇస్తుండగా బీఆర్ఎస్ నామమాత్ర పోటీతో ఉంది. బీఆర్ఎస్ ఓట్లను బదిలీ కాకుండా చేయడమే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న కింకర్తవ్యం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బిజెపికి బదిలీ అయితే డీకే అరుణ గెలుపు సునాయాసం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఓటరు కీలకమే బిఆర్ఎస్ శ్రేణులను ఎంత కాంగ్రెస్ పార్టీలోకి కలుపుకుంటే అంత వంశీచంద్ రెడ్డి గెలుపుకు మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో నాయకుల మధ్య పంతాలు పట్టింపులు రాజకీయ వైరుధ్యాలకు వెళితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క మెట్టు కాదు పది మెట్లు దిగినా తప్పులేదు. అధికారంలో ఉన్నా ఏమీ కాదు. ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగే మళ్లీ ఓటు కాంగ్రెస్ పార్టీకే వేస్తారు అని గుడ్డిగా నమ్మితే ప్రమాదం తప్పదు. పాలమూరు పార్లమెంటు బరిలో కాంగ్రెస్ పార్టీకి నిలబడి పోరాడుతున్నది డీకే అరుణ అన్న విషయం మరవద్దు. డీకే అరుణ గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలొ నేతలు కార్యకర్తలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
ఇది కూడా ప్రమాదకరమైన విషయమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సాధ్యమైనంత మేర బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొడితే చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపుకు దోహదపడుతుంది. పంతాలు పట్టింపులు పక్కనపెట్టి చేరికలపై దృష్టి సారిస్తేనే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బయటపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం అధికార చరిష్మాతో వంశీచంద్ రెడ్డి డీకే అరుణకు ప్రచారంలో గట్టి పోటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తే వంశీచంద్ రెడ్డిని విజయం తప్పక వరిస్తుందని జనాలు అంటున్నారు..

WhatsApp Image 2024 04 16 at 11.45.00 AM

SAKSHITHA NEWS