సీఎం కేసీఆర్ బహిరంగలేఖకు కౌంటర్‌గా బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి సీఎం కేసీఆర్ రాసిన లేఖే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఈరోజు వారిని ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్దకుట్ర దాగి ఉంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు.
దగాపడ్డ తెలంగాణ ప్రజలారా, మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే మహాకుట్ర జరుగుతోంది. ఈసారి మోసపోతే గోస పడతాం. తస్మాత్ జాగ్రత్త. లిక్కర్ స్కామ్‌లో బిడ్డ, పేపర్ లీకేజీలో కొడుకు, అవినీతి స్కాంల నుంచి దారి మళ్లించే కుట్రలో భాగమే సీఎం లేఖ’అని పేర్కొంటూ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
‘సమస్యలు చెప్పుకుందామని ప్రగతిభవన్‌కు వస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌస్‌కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారు’అని మండిపడ్డారు. ‘తన కుటుంబమే పరమావధిగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యేసరికి అకస్మాత్తుగా కార్యకర్తలపై ప్రేమ పుట్టుకొచ్చింది’అని ఆరోపించారు.
‘ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలకు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటివి అనేకం రాబోయే రోజుల్లో మరిన్ని బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి, తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా వారిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశారు’అని ధ్వజమెత్తారు.
‘బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. రైతులందరికీ ఫసల్బీమా యోజన కింద నష్టపరిహారం అందిస్తాం’ అని సంజయ్ పేర్కొన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మరో లేఖ రాశారు.