తాగునీరు కలుషితం కాకుండా చూడండి
** ఇన్ చార్జి జాయింట్ కలెక్టర్ మౌర్య ఆదేశం
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని ప్రజలకు పంపిణీ చేస్తున్న త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ (ఇంచార్జ్) నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు.
మంగళవారం నగరంలోని వర్షప్రభావిత ప్రాంతాలైన ఎస్టివీ నగర్, కేశవాయన గుంట, ఎస్.జి.ఎస్. కాలేజీ రోడ్డు, గొల్లవాణిగుంట, కోరమేనుగుంట, పూలవాణిగుంట, సింగాలగుంట, కేశవాయన గుంట, లక్ష్మీపురం కూడలి, గాంధీరోడ్డు లోని హథిరాంజీ మఠం తదితర ప్రాంతాలను అధికారులతో కలసి పరిశీలించారు. హథిరాంజీ మఠం వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, వర్షాలు తగ్గే వరకు దుకాణదారులు మూసివేయాలని తెలిపారు.
వర్షాల వలన నీరు ఎక్కడా కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని, నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఎక్కడైనా కలుషితం అయితే నీటి సరఫరా ఆపివేయాలని, త్రాగునీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని తెలిపారు. వర్షాల వలన జబ్బులు వచ్ఛే అవకాశం ఉందని, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని, ఎప్పటికప్పుడు మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారిని దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
పురాతనమైన, కూలిపోయే అవకాశం ఉన్న భవనాల్లో నివాసం ఉండకుండా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. జేసీ వెంట కార్పొరేటర్లు ఆంజనేయులు, నరసింహ ఆచారి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, తేజస్విని, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, డి.ఈలు, లలిత, రాజు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
