Chandrababu's arrival in Tirumala on 12..
12న చంద్రబాబు తిరుమల రాక..
అమరావతి :
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం (12వ తేదీ) చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలు దేరతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి 13వ తేదీ గురువారం ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యుల తో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.
కాగా టీడీపీ కూటమి పక్షాలు మంగళవారం సమావేశం కానున్నాయి. ఈ భేటీలో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) పక్షాలు చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుని తీర్మానం చేయనున్నారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
బుధవారం (12వ తేదీ) ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ ప్రక్కన జరిగే పనులను టీడీపీ నేతలు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జర్మన్ హ్యాంగర్స్‌తో భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. స్టేజీ పనులను తిరుపతి జేసీ ధ్యాన్‌చందర్, వైజాగ్ వీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నారు. 800 అడుగుల పొడవు, 420 వెడల్పు గల జర్మన్ హ్యాంగర్స్ తో భారీ టెంట్‌ను వేస్తున్నారు.