SAKSHITHA NEWS

పల్నాడులో తాగునీటి సమస్యను తీర్చే ‘ వాటార్ గ్రిడ్ ‘ ఏర్పాటులో మరో ముందడుగు

-రూ. 1200 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి ఆన్ లైన్ విధానంలో టెండర్లకు ఆహ్వానం

-ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

-ఫలిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి

-సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ లావు

పల్నాడు ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా నిర్మించబోయే వాటర్ గ్రిడ్ పథకంలో మరో ముందడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులతో నిర్మించే ఈ జల ప్రాజెక్టుకు రూ.1200 కోట్లతో ఆన్ లైన్ విధానం (ఈ – ప్రొక్యూర్మెంట్) లో టెండర్లకు ఆహ్వానిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10 వ తారీకు నుండి 24 వ తారీకు మధ్యాహ్నం 3 గంటల లోపు..www.tender.apeprocurement.govt.in ద్వారా టెండర్ లు వేసేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్టు లో,, నాగార్జున సాగర్ నుండి నీటిని సేకరించి,, దగ్గరలో శుద్ధ జల కేంద్రాన్ని నిర్మించి, నీటిని ఫిల్టర్ చేస్తారు, పైప్ లైన్ ల నిర్మాణం ద్వారా ఈ నీటిని గ్రామాలకు, పట్టణాలకు తరలించి.. ఓవర్ హెడ్ ట్యాంక్ ల్లో నింపుతారు.

ఈ నీటిని ఓవర్ హెడ్ ట్యాంక్ ల నుండి ప్రతీ ఇంటికీ సరఫరా చేస్తారు. ప్రస్తుతం జలజీవన్ మిషన్, అమృత దార ద్వారా ప్రతీ ఇంటికి కుళాయి ఏర్పాటు ద్వారా నీటిని ప్రతి ఇంటికి అందించే లక్ష్యంతో ఉన్నప్పటికీ.. బోర్లు వేసినా నీరు పడక కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు అంతగా ముందుకు సాగటం లేదు,, కానీ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా పరిపూర్ణంగా నీటిని అందజేయవచ్చు, అలాగే ఫ్లోరైడ్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. దీని నిర్మాణం కోసం 2019 నుంచి టిడిపి ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అవిరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు వద్ద ఈ జల ప్రాజెక్టు గురించి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో మరో ముందడుగు పడి టెండర్లు ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సంబంధిత అధికారులకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ధన్యవాదాలు తెలియజేశారు.


SAKSHITHA NEWS