
సాక్షిత: ప్రపంచంలో మరే దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మేథావి
బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తికాదని, మన దేశ ఖ్యాతిని ఖండాంతరాల్లో ఇనుమడింపచేయడానికి స్వయంగా ఆ దేవుడు మనకు ఇచ్చిన వరమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని పలువార్డులు, పార్టీ కార్యాలయంలో జరిగిన భారతరత్న అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, ఆ మహానీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగ రచన ద్వారా దేశానికి, ప్రజలకు అందించిన స్వేచ్ఛా, సమానత్వాల వల్లే భారతావని ఖ్యాతి ఖండాంతరాల్లో విలసిల్లుతోందన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని అత్యున్నత రాజ్యాంగాన్ని అంబేద్కర్ భారతీయులకు అందించారని ప్రత్తిపాటి కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వం అనే విశిష్ట లక్షణం భారత పౌరులుగా మనం అలవరుచుకున్నామంటే దానికి కారణం అంబేద్కర్ మహానీయుడేనని ప్రత్తిపాటి చెప్పారు. దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి, సమానత్వాన్ని, సంతోషాన్ని కాంక్షించి, వారి భవిష్యత్ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడన్నారు.
పాలకులు, ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించి, నడుచుకోవడం వల్లే దేశమంతా ఒకేతాటిపై ఐకమత్యంగా ముందుకు సాగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఆ మహానుభావుని ఆలోచనలు, ఆశయసాధనకు అనుగుణంగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమం, సంతోషం కోసం పాటుపడుతోందన్నారు. గత ప్రభుత్వం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి, అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలే ప్రధానంగా పాలన సాగించిందని ప్రత్తిపాటి తెలిపారు. గత పాలకుల ప్రజాకంటక విధానాలతో విసిగి వేసారిపోయిన రాష్ట్రప్రజలు, తమకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే పాలకులే కావాలని భావించి కూటమిప్రభుత్వానికి కనీవినీ ఎరుగని విజయం కట్టబెట్టారని ప్రత్తిపాటి తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం, విశ్వాసాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రగతి, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని పుల్లారావు స్పష్టంచేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు నెల్లూరి సదాశివరావు, ఇనగంటి జగదీష్, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమల రవి, కొండా వీరయ్య, పొంగులూరి వెంగళరాయుడు, గంగా శ్రీనివాసరావు, కొల్లిశెట్టి శ్రీను, బడుగు జాకోబురాజు, పిల్లి కోటేశ్వరరావు, కాన్సిలర్ లు, పార్టీ నాయకులు, పలువురు సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
