Amaravati: Empire of Mahishmati... Breathe
అమరావతి: మహిష్మతి సామ్రాజ్యమా… ఊపిరి పీల్చుకో అన్నట్లు తాజా ఎన్నికల విజయంతో అమరావతి ఊపిరి పీల్చుకోనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వప్నం సాకారం కానుంది. ఐదేళ్లుగా ఇటుక కూడా పేర్చని వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో అమరావతి వెలవెలబోయింది. మరోవైపు రాష్ట్ర జీవనాడి పోలవరం సైతం విషమ సమస్యల్లో చిక్కుకుంది. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు పరుగులు తీసిన ఈ రెండు కీలక ప్రాజెక్టుల పనులు మళ్లీ గాడిన పడబోతున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు తమ సొంత భూములైన 34 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. ఇదో మహత్తర ప్రాజెక్టు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు సాగింది. అనేక సంస్థలు ఇందులో పాలు పంచుకునేందుకు ఆసక్తిగా ముందుకొచ్చాయి. రాజధానిలో మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.పది వేల కోట్లను వెచ్చించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలన సాగుతున్న సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు చంద్రబాబు హయాంలో నిర్మించినవే. శాశ్వత ప్రణాళిక ప్రకారం వీటికి పూర్తిస్థాయిలో భవనాలు ఇంకా రూపుదిద్దుకోవాల్సి ఉంది. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం కూడా చంద్రబాబు ప్రభుత్వం భవనాలను నిర్మించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం కొత్త పుంతలు తొక్కాల్సి ఉంది. భూములిచ్చిన రైతులు గత ఐదేళ్లుగా పడని ఇబ్బందులు లేవు. వారి ఉద్యమమూ చరిత్రాత్మకమైంది. వారి ఆశలు, ఆకాంక్షలు అన్నీ కూటమి సర్కారుపైనే ఉన్నాయి.