SAKSHITHA NEWS

విద్యా బోధనతోపాటు సమ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి…………… మంత్రి జూపల్లి, డాక్టర్ చిన్నారెడ్డి

సాక్షిత వనపర్తి సెప్టెంబర్ 5

 సమాజ పరివర్తనలో విధ్య అగ్రభాగాన ఉంటుందని అలాంటి విద్యను బోధించే ఉపాద్యాయులు నిబద్ధతతో పని చేసి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్బోధించారు.
   డా. సర్వేపల్లి రాధా కృష్ణ జన్మ దినం అయిన సెప్టెంబర్ 5 గురువారం రోజు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్వే పల్లి రాధ కృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి హోదా లో పని చేశారని వారి పుట్టిన రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలుపుతూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. 

మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజ పురోభివృద్ధికి పాటు పడే విధంగా ఉత్తమ వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే అని కొనియాడారు.
ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది పిల్లలు పాఠశాలల్లో చదువుకుంటున్నారని అందులో కేవలం 22 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యాదిస్తున్నారని మిగిలిన వారంతా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లక్షల రూపాయలు వసూలు చేసి అరకొర చదువులు చెబుతుంటే .. ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పాఠశాలలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఇటీవలే ఉపాధ్యాయ పదోన్నతులు కల్పించి బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. తనకు వచ్చే 10 కోట్ల బడ్జెట్ తో పాటు సి.ఎస్.ఆర్ ఫండ్ సైతం విద్య, వైద్యానికే ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్ ను సూచించారు.
ప్రభుత్వం తరఫున అన్ని చేస్తున్నాం కాబట్టి ఉపాద్యాయులు నిబద్ధత పని చేసి నాన్యమైన విద్యను బోధించాలనీ కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, విద్యార్థులకు ప్రేరణ కల్పించాల్సిందిగా సూచించారు. మధ్యతరగతి కుటుంబంలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ విద్యాలయాల్లో పిల్లలను చదివించడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అందువల్ల పిల్లలు వారి తల్లిదండ్రులలో తరచు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. సమాజాన్ని సంస్కరించే వ్యక్తులుగా ఉపాద్యాయులు నిలవాలని వారి అవసరాలు వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాద్యాయులు అప్పుడప్పుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళాలని తద్వారా తమ మనస్సుకు విశ్రాంతి పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టింది తమిళనాడులోని తిరుత్తనూర్ లో అయిన ఆయన మన తెలుగువాడు అని గర్వంగా చెప్పుకొచ్చారు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సర్వేపల్లి కష్టపడి చదివి ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారన్నారు. స్వాతంత్రం వచ్చాక ఉపరాష్ట్రపతి గాను రెండవ రాష్ట్రపతి గాను పనిచేశారని కొనియాడారు. ఉపాద్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణనీ స్ఫూర్తిగా తీసుకోవాలని తమవృత్తికి న్యాయం చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పిల్లలు తమ ఉపాధ్యాయులను అనుకరిస్తారని అందువల్ల ఉపాద్యాయులు ఉత్తములుగా ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. వనపర్తి జిల్లాను విద్యలో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తుందని ఉపాధ్యాయులకు సమాజాన్ని తీర్చిదిద్దే గొప్ప అవకాశం ఉన్నందున దానిని సద్వినియోగ చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద దాదాపు 500 పాఠశాలకు 13.50 కోట్ల నిధులతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఉపాధ్యాయుల నుండి సమాజం ఎంతో ఆశిస్తుందని విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. తమ గురుతర బాధ్యతలను విస్మరించకుండా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలని విద్యార్థులకు పాఠాలు భట్టి పట్టేవిధంగా కాకుండా అర్థం అయ్యే విధంగా బోధించాలని సూచించారు.
అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ ఉపాద్యాయులు దేశానికి వెన్నుముక లాంటి వారని ఉత్తమ సమాజాన్ని నిర్మించే బాధ్యత ఉపాధ్యులదేనని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
అనంతరం జిల్లా నుండి ఉత్తమ ఉపాద్యాయులుగా ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, జిల్లా కలెక్టర్ శాలువాలు, మెమోటోలతో సన్మానం చేశారు.
జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజులు, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, మోటివేటర్ భాస్కర్ గుప్త, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS