ఏపీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్…
ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున నంద్యాలలో బన్నీ ప్రచారం
ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జనం
ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు
దీంతో అల్లు అర్జున్‌తో పాటు శిల్పారవిపై కేసు నమోదు
ఈ కేసు విషయమై తాజాగా ఏపీ హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్ దాఖలు
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర తరఫున నంద్యాలలో ఈ ఏడాది మే 11వ తేదీన బన్నీ ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అభిమానులు, జనాలు పోటెత్తారు.
అయితే, ఈ కార్యక్రమానికి శిల్పారవి గానీ, అల్లు అర్జున్ తరఫున గానీ ముందస్తు అనుమతి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్థానిక వీఆర్ఓ అనుమతి లేకుండా భారీ జన సమీకరణ జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో శిల్పారవితో పాటు బన్నీపై సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విషయమై తాజాగా అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. మంగళవారం విచారించే అవకాశం ఉందని సమాచారం.