SAKSHITHA NEWS

శ్రీ చిత్తారమ్మ దేవి జాతర స్వర్ణోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామదేవతల జాతరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాం….

125 – గాజులరామారం డివిజన్ శ్రీ చిత్తారమ్మా దేవి ఆలయంలో ఈనెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న జాతర స్వర్ణోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధ్యక్షతన ఆలయ కమిటీ సభ్యులు మరియు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….కోరినకొర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తులతో పూజలందుకుంటున్న శ్రీ చిత్తారమ్మ దేవి జాతరకు ప్రతీయేటా హైదరాబాద్ నగరంలోని నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వహయాంలో పెద్దలు కేసీఆర్ మార్గదర్శకత్వంలో గ్రామ దేవతల జాతరలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా రాష్ట్రవ్యాప్తంగా జాతరలు నిర్వహించామని అన్నారు. ఇందులో భాగంగానే మేడారం సమ్మక్క – సారక్క జాతర, నాగోబా జాతర లకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే శ్రీ చిత్తారమ్మ దేవి జాతర ప్రత్యేకమని స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్యంగా జాతర నిర్వహించే ఆదివారం రోజు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాటు, టెంపరరీ టాయిలెట్లు వంటి సదుపాయాలను ఏర్పాటుచేసి జాతరను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అంతకముందు ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలుకగా, చిత్తారమ్మ దేవిని దర్శించుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయకమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, దేవాలయ చైర్మన్ కూన అంతయ్య గౌడ్, మున్సిపల్ ఉప కమిషనర్ మల్లారెడ్డి, జీడిమెట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆంజనేయులు, ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్, జిహెచ్ఎంసీ ఈఈ కిష్టప్ప, ఎస్ఐ ప్రేమ్ సాగర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS