![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-18.20.51.jpeg)
14 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ వ్యక్తిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన నాగాయలంక పోలీసులు.
నాగాయలంక పోలీసులు 14 సంవత్సరాల క్రితం తప్పిపోయిన బంగ్లాదేశ్ జాతీయుడిని అతని కుటుంబ సభ్యులతో తిరిగి కలిపారు. ఈ సందర్భంగా నాగాయలంక ఎస్ఐ కె. రాజేష్ ను జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపిఎస్ అభినందించారు.
2013లో నాగాయలంక మండలం నాచుగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి గురించి సమాచారం రావడంతో పోలీసులు అతడిని విచారించారు. విచారణలో అతడు బంగ్లాదేశ్కు చెందిన ముస్లిం ఉద్దీన్ అని తేలింది. అతడి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
శిక్ష అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు అతడిని నాగాయలంక పోలీస్ స్టేషన్కు పంపించారు. అప్పటి నుండి అతడు పోలీస్ స్టేషన్లోనే ఉంటూ తన కుటుంబ సభ్యుల కోసం ఎదురుచూస్తున్నాడు.
గతంలో నాగాయలంక పోలీస్ స్టేషన్లో పనిచేసి ప్రస్తుతం కూచిపూడి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ఎం. సుబ్రహ్మణ్యం అతడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నాగాయలంక పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎస్ఐ కె. రాజేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతని కుటుంబ సభ్యుల వివరాలను ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేశారు.
దీంతో అతడి బంధువు ఒకరు ఫొటోను గుర్తించి నాగాయలంక పోలీసులను సంప్రదించారు. దీంతో ఎస్ఐ కె. రాజేష్ జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపిఎస్ ఆదేశాల మేరకు, అవనిగడ్డ డిఎస్పి టి. విద్యశ్రీ మరియు సిఐ ఐ. యువ కుమార్ పర్యవేక్షణలో అతడిని వెస్ట్ బెంగాల్ లోని హరిదాస్పూర్ చెక్ పోస్ట్ వద్ద భారత దేశ సరిహద్దు సైనిక దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వారి సమక్షంలో బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(BGB) దళానికి అప్పగించారు. అక్కడి నుంచి అతను తన ఇంటికి సురక్షితంగా చేరుకొని తన తమ్ముడితో కలిసి ఫోటో దిగి నాగాయలంక పోలీసు వారికి పంపి, కృష్ణా జిల్లా పోలీస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-18.20.51-1024x771.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app