రంకెలేస్తున్న ఒంగోలు గిత్తలు.. బాలినేని, దామచర్ల మధ్య మాటల యుద్ధం
ఒంగోలు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి-సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మధ్య గత కొన్నేళ్లుగా పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనని అంతా భావించారు. కానీ నేతలు మాత్రం తగ్గేదేలేదంటున్నారు. సయోధ్యకు చాన్సే లేదని సందేశమిస్తున్నారు.
బాలినేని జనసేనలోకి రావడాన్ని స్వాగతిస్తూ ఆయన అభిమానులు శనివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. బాలినేని అభిమానులు పవన్ కల్యాన్, చిరంజీవి, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై దామచర్ల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని తొలగించేందుకు ప్రయత్నించారు.
బాలినేని జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించడంపై దామచర్ల సెటైర్లు వేశారు. అధికారంలో ఉన్నప్పుడు తనపై పెట్టిన అక్రమ కేసులను మర్చిపోలేదన్నారు. బాలినేని, ఆయన కుమారుడు చేసిన అవినీతిపై కేసులు పెట్టక తప్పదన్నారు. ఆ కేసుల నుంచి ఎవరు రక్షిస్తారో చూస్తామన్నారు దామచర్ల.
దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని ఫైర్ అయ్యారు. తాను అవినీతికి పాల్పడ్డానన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ చంద్రబాబుకు లేఖ రాశానన్నారు. తనను కేసుల నుంచి పవన్ కల్యాణ్ కూడా కాపాడలేరంటూ దామచర్ల మాట్లాడటం తగదన్నారు.బాలినేని కూటమిలో చేరకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి.