ప్రకృతి ఆరాధనకు ప్రతీక… శీతల భవాని పండుగ

Sakshitha news

ప్రకృతి ఆరాధనకు ప్రతీక… శీతల భవాని పండుగ

ప్రభుత్వ సెలవు ప్రకటించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి : ధరావత్ శివ నాయక్.

సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో

భారతదేశ గిరిజన సంస్కృతిలో బంజారా (లంబాడి/గోర్) సమాజానికి వేల సంవత్సరాల చరిత్రతో పాటు గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం ఉందని, ఆ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత పండుగల్లో శీతల భవాని పండుగ ఒకటని లంబాడి విద్యార్థి సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ధరావత్ శివ నాయక్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం రోజున తెలంగాణతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో బంజారా సమాజం ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఐక్యతతో, ప్రకృతి ఆరాధనతో నిర్వహిస్తుందని తెలిపారు. బంజారా సంప్రదాయం ప్రకారం సాతీ భవానిలు (ఏడు భవానిలు) ఆదిశక్తి యొక్క ఏడు రూపాలుగా భావిస్తారని వివరించారు. ప్రాంతానికొక విధంగా పేర్లలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ సాధారణంగా హింగ్లా భవాని, కంకాళి భవాని, తుల్జా భవాని, మేరామా భవాని, మంత్రాల్ భవాని, ధవళాంగర్ భవాని, శీతల భవాని పేర్లతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ దేవతలు ప్రజలకు ఆరోగ్యం, ధైర్యం, పంటల సమృద్ధి, పాడిపశువుల అభివృద్ధి, గ్రామ రక్షణ, ప్రకృతి సమతుల్యతను ప్రసాదించే శక్తి స్వరూపాలుగా బంజారా సమాజం విశ్వసిస్తుందని, ముఖ్యంగా శీతల భవానిని గ్రామాన్ని అంటువ్యాధులు, పశువుల వ్యాధులు, ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే గ్రామదేవతగా కొలుస్తారని పేర్కొన్నారు. శీతల భవాని పండుగ కేవలం పూజా కార్యక్రమం మాత్రమే కాదని, ప్రకృతిని, పశుసంపదను, సమాజ ఐక్యతను ఆరాధించే జీవన తత్వానికి ప్రతీక అని తెలిపారు. తండా వెలుపల ఉన్న శీతల భవాని స్థలానికి ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో చేరుకుని, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, గుగ్గిళ్లు, ఇతర నైవేద్య పదార్థాలు, నీటిని సమర్పిస్తారని వివరించారు. ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన గుగ్గిళ్లను ఒకచోట కలిపి అమ్మవారికి నివేదించిన అనంతరం వాటిని తిరిగి అందరికీ పంచిపెట్టడం ద్వారా “మనమంతా ఒక కుటుంబం – మన సుఖదుఃఖాలు ఒకటే” అనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని తెలిపారు. పండుగ సందర్భంగా ప్రతి కుటుంబం తమ ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి పాడిపశువులను శుభ్రంగా స్నానం చేయించి, బొట్లు పెట్టి, రంగురంగుల అలంకరణలతో అమ్మవారి సన్నిధికి తీసుకువస్తారని చెప్పారు. పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా, అవి వృద్ధి చెందాలని, పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురవాలని శీతల భవానిని వేడుకుంటారని తెలిపారు. అనంతరం అన్ని పాడిపశువులతో శీతల భవాని ఆలయ ఆవరణలో ఊరేగింపు నిర్వహించడం ఈ పండుగలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టమని, ఇది బంజారా సమాజం పశుసంపదకు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా బంజారా యువత, మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో జానపద నృత్యాలు చేస్తూ, సంప్రదాయ గేయాలు ఆలపిస్తూ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ నృత్యాలు వినోదం మాత్రమే కాకుండా బంజారా సంస్కృతి, చరిత్ర, ఐక్యతకు జీవం పోసే ఆచారాలని వివరించారు. శీతల భవాని పండుగ ప్రకృతిని ప్రేమించడం, నీటిని గౌరవించడం, పశుసంపదను సంరక్షించడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం వంటి విలువలను నేర్పిస్తుందని ధరావత్ శివ నాయక్ అన్నారు. నేడు ప్రపంచం పర్యావరణ పరిరక్షణ గురించి చర్చిస్తున్న సమయంలో బంజారా సమాజం శతాబ్దాలుగా ప్రకృతి పూజ ద్వారా ఆ విలువలను ఆచరిస్తూ వస్తోందని, ఈ గొప్ప సంస్కృతి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శీతల భవాని పండుగ బంజారా సమాజానికి అత్యంత పవిత్రమైన పండుగ కావున తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా గుర్తించి ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.

అలాగే శీతల భవాని పండుగ నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, బంజారా తండాల్లోని శీతల భవాని దేవాలయాలను అభివృద్ధి చేయాలని, బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక సాంస్కృతిక అకాడమీ ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పాఠ్యపుస్తకాలలో బంజారా సంస్కృతి, సాతీ భవానిల చరిత్ర, శీతల భవాని పండుగ విశిష్టతను చేర్చాలని, యువతకు తమ సంస్కృతి గురించి అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. శీతల భవాని పండుగ కేవలం బంజారా సమాజానిదే కాదని, ప్రకృతి, పర్యావరణం, పశుసంపద, సామాజిక ఐక్యతను గౌరవించే భారతీయ సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శీతల భవాని అమ్మవారి ఆశీస్సులతో ప్రతి తండాలో సుఖశాంతులు నెలకొనాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని, పాడిపశువులు అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ధరావత్ శివ నాయక్ ఆకాంక్షించారు.

Scroll to Top