SAKSHITHA NEWS

గవర్నర్ వ్యవస్థపై కీలక కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సుప్రీం కోర్టులో గవర్నర్ల అంశంపై కేసులు విచారకరమన్న జస్టిస్ నాగరత్న

గవర్నర్ ను పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యతని హితవు

పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని వ్యాఖ్య

ప్రస్తుతం దేశంలోని పలు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ లు వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది.

అసెంబ్లీ పాస్ చేసిన పలు కీలక బిల్లులను అక్కడి గవర్నర్ లు ఆమోదించకపోవడం వివాదాస్పదం అవుతోంది. ఈ క్రమంలో గవర్నర్ ల తీరుపై అక్కడి ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇటీవల కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ గవర్నర్ లు చాలా నెలలుగా బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ లు దాఖలు చేయగా, విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

గతంలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గవర్నర్ లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రి సిఫార్సు చేసినా మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్ పై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య నెలకొన్న ఈ వివాదాలు ఓ పక్క చర్చనీయాంశంగా మారిన తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న గవర్నర్ ల వ్యవస్థపై మరోసారి కీలక కామెంట్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఎన్ఎల్ఎస్ఐయూ – పీఏసీటీ సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న పలు కీలక అంశాలపై మాట్లాడారు.

గవర్నర్ల తటస్థత గురించి నాటి రాజ్యాంగ సభ చర్చలలో జి. దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న గుర్తు చేస్తూ.. గవర్నర్ లను పార్టీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యత అని అన్నారు. పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని అన్నారు. గవర్నర్ల అంశంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు విచారకరమని పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న గతంలోనూ గవర్నర్ల తీరును ఆక్షేపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో నల్సార్ యూనివర్శిటీలో పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరో మారు జస్టిస్ నాగరత్న .. గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

WhatsApp Image 2024 08 05 at 11.40.00

SAKSHITHA NEWS