వెయ్యి అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన
** ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: “హర్ ఘర్ తిరంగ” కార్యక్రమంలో భాగంగా ఉదయం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్.వి. యూనివర్సిటీ సంయుక్తంగా 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన మహతి ఆడిటోరియం నుంచి ఎస్.వి.యూనివర్సిటీ స్టేడియం వరకు వెయ్యి అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థిని విద్యార్థుల ద్వారా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ వెయ్యి అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, రాష్ట్ర, దేశ స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రెండు వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారని అన్నారు.
ఈ వేడుకల్లో కేవలం జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని తెలిపారు. మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వే ఫౌండేషన్ సంస్థ అందించిన వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలని సూచించారు. దేశ పురోగతి గురించి అపోహలు తొలగించి, దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ గతంలో కేవలం ఆఫీసులు, సంస్థల్లో మాత్రమే జెండా ఎగురవేసే వాళ్లమని…. ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి రెండు వారాల కార్యక్రమం రూపకల్పన చేసి ప్రారంభించామని చెప్పారు. సెల్ఫీ పాయింట్ వద్ద మీరు సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సర్టిఫికెట్ ఇస్తారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ఒక రోజుకే పరిమితం చేయకుండా, ప్రతిరోజూ మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించేలా ఉండాలని కోరారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నగర పరిశుభ్రతకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ రాష్ట్ర చైర్మన్ మన్నూరు సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహయాదవ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ రాయల్, డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునికృష్ణ, ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు, టూరిజం డీఎం రమణ ప్రసాద్, మున్సిపల్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి జనార్ధన్, కార్పొరేటర్లు నరసింహ ఆచారి, నరేంద్ర, రేవతి, కాంచన, కుమారి, అన్నా అనిత, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
