SAKSHITHA NEWS

మైలవరం నియోజకవర్గానికి అపారనష్టం.

కేంద్ర బృందానికి వివరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు.

ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి,

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని, ముఖ్యంగా బుడమేరు వరదల వల్ల మైలవరం నియోజకవర్గానికి అపార నష్టం కలిగిందని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది.

కొండపల్లి శాంతినగర్ – కవులూరు గ్రామాల మధ్య బుడమేరుకు పడిన గండ్లు, వాటిని పూడ్చిన వైనం, ఇక్కడి నుంచి వరద నీరు పొలాలను, విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వైనం గురించి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కేంద్ర కమిటీ సభ్యులకు సమగ్రంగా తెలిపారు.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వరద పరిస్థితిని వివరించారు.

వరద పరిస్థితి, నష్టం అంచనా, ప్రధానంగా వ్యవసాయం, చెరువులు హార్టికల్చర్, పశు సంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, నీటి వనరులు, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో సంభవించిన నష్టాలపై కేంద్ర బృందానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు సుదీర్ఘంగా వివరించారు.

శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లు వరద నీటితో నిండాయని సెంట్రల్ టీంకు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా డెల్టా మీదుగా కొల్లేరు సరస్సులో కలిసే బుడమేరు ఉప్పొంగిన కారణంగా ముంపుకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు.

బుడమేరుకు సామర్థ్యానికి మించి నీరు రావడం, గండ్లు పడటం, ప్రవాహానికి ఆటంకాలు కలగడం, విజయవాడ బ్యారేజ్ కు రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావడం తదితర కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర బృందానికి తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తూ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను ఉదృతంగా చేపట్టి ఆదుకున్నారని పేర్కొన్నారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS