తిరుచానూరులో వైభవంగా రథోత్సవం
అమ్మవారి పంచమీ తీర్థం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఉదయం రథోత్సవం కన్నులపండుగగా జరిగింది.
ఉదయం 09.15 గంటలకు ధనుర్ లగ్నంలో రథోత్సవం మొదలై ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధులలో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల కోర్కెలు సిద్ధిస్తాయని విశ్వాసం. రథోత్సవం ఉత్సవం మాత్రమే కాదు.
భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాల కడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారికి రథమండపంలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. కాగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై అమ్మవారు దర్శనం ఇచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అతి కీలక, చివరి ఘట్టం అమ్మవారి పంచమీ తీర్థం మంగళవారం జరగనుంది. దీంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. రథోత్సవంలో తిరుమల శ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీ చిన్న జీయర్‌స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వీర బ్రహ్మం, సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో హరింధ్రనాథ్, ఆలయ అర్చకులు బాబుస్వామి, శ్రీనివాసా చార్యులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
