అండగా ఉన్న సంస్థ… ఇప్పుడు గుదిబండగా…!
అల్ట్రాటెక్ రాకతో అటకెక్కిన పాలకుర్తి సామాజిక సేవలు….
…..
సాక్షిత పెద్దపల్లి//పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో
ఒకప్పుడు కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో… పాలకుర్తి మండలంలోని గ్రామాలు సామాజిక సేవలతో కళకళలాడేవి. వేసవి కాలంలో ఎక్కడ చూసినా చలివేంద్రాలు కనిపించేవి. పేదలు, వృద్ధులకు అండగా నిలిచే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబడేవి. అయితే, ఈ పరిశ్రమ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కేశోరామ్ యాజమాన్యం ప్రజల అవసరాలను గుర్తించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టేది. వేసవిలో ప్రతి గ్రామంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారుల దాహం తీర్చేది. చలికాలంలో పేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసేది. వర్షాకాలంలో గొడుగులు, రెయిన్‌కోట్లు వంటి అవసరమైన వస్తువులు అందించేది.
కానీ అల్ట్రాటెక్ యాజమాన్యం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కంపెనీ లాభాలపైనే దృష్టి సారిస్తోందే గానీ, చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు.
ఈ పరిస్థితికి స్థానిక రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కారణమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కంపెనీని నిలదీయడంలో వారు విఫలమవుతున్నారని ప్రజలు అంటున్నారు. మరోవైపు, గతంలో చురుగ్గా పనిచేసిన కార్మిక సంఘాలు కూడా ఇప్పుడు మౌనం వహిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సి ఎస్ ఆర్ కింద గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పేర్కొంటున్నారు.
పాలకుర్తి మండల భూములు, వనరులు వినియోగిస్తూ కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్న అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం వెంటనే స్పందించి, గతంలో మాదిరిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, పేదలకు కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా నాయకులు మేల్కొని ప్రజల పక్షాన నిలబడతారా…? లేక కంపెనీ యాజమాన్యానికే మద్దతు ఇస్తారా…? అన్నది చర్చనీయాంశంగా మారింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY