SAKSHITHA NEWS

ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. సాగిన 3కె రన్…
*ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి, కమిషనర్ మౌర్య

సాక్షిత : స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉదయం నిర్వహించిన 3కె రన్ ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ఈ 3కె రన్ ను ఉదయం వివేకానంద కూడలి వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. వివేకానంద కూడలి నుండి ప్రారంభమైన టౌన్ క్లబ్, బాలాజీ కాలనీ మీదుగా ఎస్.వి.యూనివర్సిటీ వరకు ఈ 3కె రన్ పరుగు పందెంలో పెద్ద యువకులు, విద్యార్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కోసం స్వచ్చత హి సేవ లో భాగంగా గత పది రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. స్వచ్చ భారత్ ప్రధాని నరేంద్ర మోడి ప్రవేశపెట్టిన గొప్ప పథకం అన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో ఇల్లు, పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడళ్ళలో, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. యువత పరిశుభ్రతపై తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. పరిశుభ్ర నగరంగా తిరుపతిని దేశంలో నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చెత్త పన్ను ను రద్దు చేశారని అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్. మౌర్య మాట్లాడుతూ స్వచ్చత హి సేవ కార్యక్రమంలో పరిశుభ్రత పై ప్రజలందరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు స్వచ్చత హి సేవ కార్యక్రమం ఉంటుందని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. వేస్ట్ టు వండర్ పోటీలు, పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, పి.పి.ఈ కిట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 1వ తేదిన పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు. మ్యాప్ మై ఇండియా యాప్ ను ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకుని పారిశుద్ధ్య సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. 3కె రన్ పురుషుల విభాగంలో హేమంత్ కుమార్, సాంసన్, సాయి కృష్ణ, మొదటి, రెండవ, మూడవ స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో గౌతమి, చౌడేశ్వరి, బబిత మొదటి, రెండవ, మూడవ స్థానంలో నిలిచారు. పిల్లల విభాగంలో దానిష్, ప్రదీప్ కుమార్ లు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచారు. గెలుపొందిన వారికి అక్టోబర్ 2న జరిగే కార్యక్రమం లో నగదు బహుమతులు అందిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, సెట్విన్ సి ఈ ఓ మురళీకృష్ణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మేనేజర్ సయ్యద్, శానిటరీ సువర్ వైజర్ చెంచయ్య, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS