SAKSHITHA NEWS

అడ్డంకులు దాటుకుని ప్రజలు జనగర్జనను జయప్రదం చేశారు

….. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు

అశ్వారావుపేట sakshitha న్యూస్ : టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్క చేయక ప్రజలు ఖమ్మంలో జరిగిన సభను విజయవంతం చేశారని, జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని టీపీసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తాటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎప్పుడూ తనిఖీలు నిర్వహించని ఆర్టిఏ అధికారులు, ప్రభుత్వ ఒత్తిళ్ళ మేరకు పోలీస్ శాఖ వారు కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన జనగర్జన సభకు ప్రజలను రానీయకుండా అడ్డుకున్నారని, కెసిఆర్ ప్రభుత్వం జన గర్జన సభను అడ్డుకునేందుకు పడరాని పాట్లు పడ్డారని, కానీ ప్రజలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జనను అనుకున్న దానికంటే గొప్పగా విజయవంతం చేశారని దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తానని, టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేసిన కేసీఆర్ ఈరోజు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే విధంగా ఒక రంగం కాకుండా అనేక రంగాలను దోపిడీ చేసి సంక్షేమంలోకి నెట్టారని, నిధులు నీళ్లు నియామకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం పోరాడితే ఆనాడు తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ దిక్కని తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పెద్దలంతా సోనియా గాంధీని కలసి విన్నవిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.

ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో మరొకసారి ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నించిందని, చెరువుల పండుగల పేరుతో లక్షలాది రూపాయలను గ్రామపంచాయతీ నుండి లెక్కలేకుండా ఖర్చు పెట్టించిందని, పదివేలు ఖర్చు పెట్టి లక్ష రూపాయలు ఖర్చు చూపించే అవకాశం కల్పించిందని, ఈ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు అర్థం కాని పరిస్థితి ప్రజల్లో నెలకొందని, ఏం సాధించామని ఇంతసేపు నిర్వహిస్తున్నారని వారు విమర్శించారు.

ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో నిత్యవసర వస్తువులు కూరగాయల ధరలు అమాంతం పెరిగి ప్రజలు బ్రతకలేని దయనీయ పరిస్థితిలో ఉన్నారని, ఏ ధరలు చూసినా ఆకాశాన్ని నింపుతున్నాయని, ధరలు అదుపు చేయలేని ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తుందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 119 కి 119 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాష్ట్రమంతా కాంగ్రెస్ వైపే చూస్తుందని నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి వీరభద్రం, జేష్ట సత్యనారాయణ చౌదరి, అంకత మల్లికార్జునరావు, పొట్ట రాజులు, బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS