కార్యాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఖమ్మం :
కార్యాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఐడిఓసి లో అధికారులు, సిబ్బంది చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఐడిఓసి ఆవరణలో స్వయంగా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కల తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గురువారం కార్యాలయ పనివేళలు ప్రారంభానికి ముందు ఐడిఓసి ఆవరణ, కార్యాలయాల లోపల క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. పని ప్రదేశాలు పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి, పనిపై ధ్యాస పెరుగుతుందని అన్నారు. ఎవరో వస్తారు, చేస్తారు అని చూడక, మనం పనిచేసే ప్రదేశాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మనం ఎక్కువ సమయం వుండే కార్యాలయాన్ని అలాగే పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వచ్చే డెంగ్యూ సీజన్ కావున పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ప్రభుత్వం నిధులు వెచ్చించి సౌకర్యాల కల్పన చేస్తుందని, అట్టి సౌకర్యాలు మనం సద్వినియోగం చేసుకుంటూ, వాటిని కాపాడుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఐడిఓసి లోని వివిధ కార్యాలయాలు పరిశీలించి, సూచనలు చేశారు. ప్రతి కార్యాలయం తప్పనిసరిగా ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ చేయాలన్నారు. ఈ-ఆఫీస్ తో ఫైళ్ల నిర్వహణ సులభతరమే కాక, సురక్షితంగా వుంటాయని ఆయన తెలిపారు. పాత ఫైళ్లను నిబంధనల మేరకు ఖండనము చేయాలని, అవసరం లేని ఫైళ్లను వారం లోగా తొలగించాలని అన్నారు. పాత ఫైళ్ళతో డస్ట్ ఏర్పడి, ఆరోగ్య సమస్యలు వస్తాయని, అనవసరంగా భద్రపర్చడంతో నిల్వ సమస్యలు వస్తాయని అన్నారు. వారంలో తిరిగి తనిఖీకి వచ్చేలోపు రన్నింగ్ ఫైళ్లు, నిబంధనల మేరకు భద్రపర్చాల్సిన ఫైళ్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ అన్నారు. కార్యాలయం లోపల మంచి వాతావరణం ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐడిఓసి లో నాటిన మొక్కల వద్ద నున్న కలుపు, పిచ్చి మొక్కలను అధికారులు, సిబ్బంది తో కలిసి కలెక్టర్ తొలగించారు. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.