SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఈదుల్ ఫిత్ర్ పండుగను జరుపుకోవాలంటే షవ్వాల్ నెలవంక కనపడాల్సిందే. రమజాన్ నెల చివరి రోజుల్లో ఆకాశంలో నెలపొడుపును చూసేందుకు ముస్లిములు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. చంద్రవంక కానరాకముందే వీధిలో ఉన్న పేద ముస్లిముల ఆచూకీ కనిపెట్టండి. వారికి ఫిత్రా దానాలు చేసి పండుగ సంతోషాలు పంచండి. రమజాన్ నెల ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తిచేసినందుకు గాను అల్లహ్ కు కృతజ్ఞతగా ఫిత్రాదానాలు చెల్లించాలన్న ప్రవక్త (స) ఆదేశాన్ని తప్పకుండా పాటించాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర లెక్కగట్టి ఆ డబ్బును నిరుపేదలకు పంచాలి. ఆ డబ్బుతో పేదలు సైతం పండుగ బట్టలు, ఈద్ సామగ్రి కొనుగోలు చేసుకుంటారు. వారూ పండుగను సంతోషంగా జరుపుకుంటారు.


ఖదీదైన అజ్వా ఖర్జూరానికి విలువగట్టి ఇవ్వండి..
రెండున్నర కిలోల గోధుమలు లేదా మూడున్నర కిలోల బార్లీ, మూడున్నర కిలోల ఖర్జూరాలు, మూడున్నర కిలోల కిస్మిస్ వీటిలో ఏ ఒక్కదానిపైన విలువను లెక్కగట్టి ఆ డబ్బును అభాగ్య ముస్లిములకు దానం చేయాలి. కానీ చాలామంది అతి తక్కువ విలువైన గోధుమలపై లెక్కగట్టి దానం చేస్తారు. ‘మన స్వయానికైతే విలువైన వస్తువులను ఎంపికచేసుకుంటాం. మరి ఇతరులకు ఇచ్చేటప్పుడు మాత్రం లోయెష్ట్ కేటగిరీని దానం చేస్తాం. ఎదుటి వారికిచ్చేటప్పుడు ఉత్తమమైన వాటిని ఇవ్వాలి’’ అంటారు ఉలమాలు. కొంతమంది అత్యంత ఖరీదైనy అజ్వాఖర్జూరం పరిమాణానికి తగ్గ డబ్బును లెక్కగట్టి ఫిత్రా చెల్లిస్తారు. కిలో అజ్వా ఖర్జూరం రూ.1500ల నుంచి రూ.2వేల వరకూ ఉంటంది. మూడున్నర కిలోల అజ్వా ఖర్జూరం వెల సుమారు రూ.5500లు ఉంటుంది. ఎవరి స్థోమతను బట్టి వాళ్లు ఫిత్రా దానాలు చేయకుండా మధ్యతరగతి వారూ, ఎగువమధ్య తరగతి వారూ, సంపన్నులు, కుబేరులు అంతా గోధుమల విలువను లెక్కగట్టి ఫిత్రా దానం చేస్తున్నారు. గోధుమలపై ఇచ్చే ఫిత్రా అయితే రూ.90 లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మనకిచ్చిన దాంట్లో అల్లాహ్ మార్గంలో మనస్ఫూర్తిగా ఖర్చు చేయాలి. మనం ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి ఎన్నోరెట్లు తిరిగి మనవద్దకే వచ్చి చేరుతుంది.

  • ముహమ్మద్ ముజాహిద్

SAKSHITHA NEWS