SAKSHITHA NEWS

సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ .

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు.

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 5.4.2023.

ఒకవైపు స్వేచ్ఛాయుత భారతావని కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం విశ్రమించకుండా సమర శంఖం పూరించిన విప్లవ యోధులు, డాక్టర్ బాబూ జగ్జీవన్‌ రామ్‌ గారు అని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు.

భారతదేశ మాజీ ఉపప్రధాని, స్వాతంత్ర్య సమర యోధులు, దళిత హక్కుల కోసం కృషిచేసిన మహోన్నత వ్యక్తి, అహింసామూర్తి, రాజ్యాంగ సభ సభ్యులు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతిని ఇబ్రహీంపట్నంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.

శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్‌ గారు జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేయగలిగారన్నారు. 52 ఏళ్లపాటు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. ఇటువంటి మహనీయుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS