వెయ్యి రోజుల ప్రజాపాలనకు జననీరాజనం….
రామగుండం నవనిర్మాణ నాయకుడు రాజ్‌ఠాకూర్‌కు ఘన స్వాగతం 1,500 మందితో భారీ ర్యాలీ….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందంటూ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో సుమారు 1,500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
స్థానిక ప్రధాన చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ రీగల్ షూ మార్ట్ సెంటర్, లక్ష్మీనగర్ టీ జంక్షన్, కళ్యాణ్‌నగర్ చౌరస్తా, సిటీ స్కాన్ సెంటర్, డాక్టర్స్ స్ట్రీట్, ఓల్డ్ అశోక్ సెంటర్ మీదుగా తిరిగి ప్రధాన చౌరస్తాకు చేరుకుంది. ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక, కార్మిక, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు
లక్ష్మీనగర్ టీ జంక్షన్ వద్ద ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారం, మార్గదర్శకత్వంతో రామగుండం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా దాదాపు రూ.900 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, క్యాత్‌ల్యాబ్ ఏర్పాటు, నూతన రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, మురుగునీటి శుద్ధి కేంద్రం, ఇతర అభివృద్ధి పనులు, గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణం, నర్సింగ్ కళాశాల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి, భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.
రామగుండం అభివృద్ధి ఒక్కరి వల్ల సాధ్యం కాదని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి సహకారంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని రాజ్‌ఠాకూర్ అన్నారు. భవిష్యత్‌లో రామగుండాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
ప్రజల ఆశీర్వాదమే బలం
వెయ్యి రోజుల ప్రజాపాలనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి తనపై అభిమానం చూపిన రామగుండం ప్రజలకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో మరింత సమర్థవంతమైన ప్రజాపాలన అందిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి అసలైన ఆస్తి అని, వారికి, రామగుండం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అడుగడుగునా ఘన స్వాగతం
ర్యాలీ సాగిన ప్రధాన వీధుల్లో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌కు వివిధ వర్గాల ప్రజలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికారు. కాపు, ముదిరాజ్, గంగపుత్ర, మాల, మాదిగ సంఘాల ప్రతినిధులతో పాటు ఆటో యూనియన్ నాయకులు, వ్యాపారులు, వర్తక సంఘాల ప్రతినిధులు, మైనారిటీ పెద్దలు, లారీ యజమానుల సంఘం ప్రతినిధులు, రజక సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు.
ర్యాలీ సమయంలో పలువురు ప్రజలు తమ నివాసాలపై నుంచి పూలు చల్లి అభిమానం చాటుకున్నారు. దీంతో ప్రధాన వీధులు కాంగ్రెస్ పార్టీ జెండాలు, నినాదాలతో మార్మోగాయి.
ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, జిల్లా నాయకులు దీటి బాలరాజు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వర్తక, వ్యాపార సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST