SAKSHITHA NEWS

మైలవరం నియోజకవర్గంలో రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు విజ్ఞప్తి.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమావేశం.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

మైలవరం నియోజవర్గంలో రైల్వే శాఖకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైల్వే జనరల్ మేనేజర్ సమక్షంలో జరిగిన రైల్వే బోర్డు సమావేశంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించారు.

ఈ సమావేశంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ , జిల్లా ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రైల్వే గతి శక్తి బోర్డు మంజూరు చేసిన పూర్తి చేసిన ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి వద్ద లెవల్ క్రాసింగ్ (ఎల్.సి) 140 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB), ఇబ్రహీంపట్నం మండలంలోని ఈలప్రోలు వద్ద ఎల్.సి 147 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB), విజయవాడ గ్రామీణ మండలంలోని రాయనపాడు వద్ద ఎల్.సి నెంబరు 148 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి + రోడ్ అండర్ బ్రిడ్జి (ROB+RUB)
విజయవాడ గ్రామీణ మండలంలోని గొల్లపూడి వద్ద ఎల్.సి నెంబరు 150 వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మించాలని కోరారు.

విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామ ప్రాంతంలో మూడు అదనపు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. దీని కారణంగా రెండు వైపులా ఉన్న కాలువలు పూర్తిగా మూసివేయబడ్డాయన్నారు. రైల్వే శాఖ ద్వారా రెండు వైపులా కొత్త డ్రెయిన్లు నిర్మించనున్నారన్నారు. తాగునీటి పైపు లైన్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. పైపులైన్లను మరమ్మతు పనులు చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు.

రైలు నంబర్ 07755 డోర్నకల్ నుండి విజయవాడ ప్యాసింజర్‌ను కోవిడ్ సమయంలో నిలిపివేశారని అన్నారు. వ్యవసాయ కార్మికులు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వ్యవసాయ పనులకు వెళ్లడానికి ప్రతిరోజూ ప్రయాణించే వారికి సౌకర్యంగా ఉండేలా దీనిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఇది వారి జీవనోపాధికి చాలా అవసరమని పేర్కొన్నారు.

రాయనపాడు రైల్వే స్టేషన్‌లో గోల్కొండ, శాతవాహన రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కొంత భాగం వంటి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్‌లో రద్దీని నివారించడానికి ఈ రెండు రైళ్ళను రాయనపాడులో నిలపాలన్నారు. రైల్వే శాఖ అధికారులు తక్షణమే ఆయా సమస్యలపై స్పందించాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app