సంధ్య ధియేటర్ ఇష్యూ పక్కదారి పడుతోందా?
డౌటే లేదు. సంధ్యా ధియేటర్ సమస్య పక్కదోవ పడుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలూ, మంత్రులు, ముఖ్యమంత్రి, పోలీస్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి వాస్తవాలు క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి.
అసలు సమస్య ఏమిటి?
అల్లు అర్జున్ సంధ్య ధియేటర్‌కి వెళ్లాడు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందింది. మరో పిల్లాడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఎవరు మాట్లాడినా దీనిపై మాట్లాడాలి. అంతే. సింపుల్. దీనికీ.. పుష్ప సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌కీ, అతనికి వచ్చిన నేషనల్ అవార్డుకీ సంబంధం ఏమిటి?
పోలీసుల్ని చితగ్గొట్టినందుకే పుష్పలో బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చారా? అని ఓ పోలీస్ అధికారి వ్యంగ్య బాణాలు సంధించాడు. ఇప్పుడు సమస్య పుష్ప సినిమాలో పోలీస్ అధికారుల పాత్రల్ని చూపించిన విధానంపైనా? బన్నీకి నేషనల్ అవార్డు ఇచ్చిన ప్రక్రియపైనా? అసలు మాట్లాడేవాళ్లకేమైనా అర్ధమవుతోందా?
నిజానికి పోలీస్ వ్యవస్ధని చిన్న చూపు చూశారని, నీచంగా చూపించారని ఆ పోలీసాయనకు అనిపిస్తే పుష్ప సినిమా విడుదల అయినప్పుడో, ఆ సినిమాకు గానూ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడో ఆయన ప్రతిఘటించాలి. ఇప్పుడు కాదు.
ఇప్పుడు కేవలం సమస్యపై మాట్లాడాలి. కానీ దాన్ని గాలిలి వదిలేశారు.
ఈ సినిమాలో ఏం సందేశం ఉందని రాయితీలు ఇవ్వాలి? స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇవ్వాలి? అని ప్రశ్నించారు ఓ మంత్రి గారు.
అంటే సందేశాత్మక చిత్రాలే సినిమాలా? అవే తీయాలా? అలా తీస్తేనే తెలంగాణలో చిత్రసీమకు మనుగడ?
ఇంత దిక్కుమాలిన సినిమాని నేనెప్పుడూ చూడలేదు? అని ఓ పార్టీ అధినేత ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకీ అసలు సమస్య బుర్రకి ఎక్కినట్టు కనిపించడం లేదు. ప్రజా ఉద్యమంలో ఉన్న మనుషులు, నేతలు.. సినిమాల్లోని విషయాలపై డిబేట్ చేయడం ఏమిటి? బన్నీ చేసింది తప్పు అనండి. లేదా… ఏయే విషయాల్లో బన్నీ తప్పు చేశాడో చెప్పండి. అంతే కానీ అసలు సమయం సందర్భం లేకుండా ఓ సినిమాని పోస్ట్ మార్టం చేయడం ఏమిటి?
ఈరోజు కొంతమంది బన్నీ ఇంటి మీద పడ్డారు. రాళ్లు రువ్వారు. కుండీలు బద్దలు కొట్టారు. ఇలా చేస్తే.. చనిపోయిన రేవతికి న్యాయం జరుగుతుందని భావించడం వాళ్ల మూర్ఖత్వం. అద్దాల మేడలపై రాళ్లు రువ్వడం ఎంత సేపు? కానీ పొరపాటున ఆ రాయి ఎవరికైనా తగిలితే.. ఏదైనా జరగరానిది జరిగితే, ఆ ఆవేశం కట్టలు తెంచుకొని ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే అప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ విషాదానికి కారణం ఎవరు?
అల్లు అర్జున్ చేసింది తప్పో, ఒప్పో న్యాయస్ధానం నిర్ణయిస్తుంది. తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. కానీ అది చేసిన తప్పుకు మాత్రమే. సంధ్య ధియేటర్‌లో జరిగిన ఘటనకు మాత్రమే. అంతే తప్ప అసలు బన్నీకి నటనే రాదని, పుష్ప అసలు సినిమానే కాదని మాట్లాడడం.. బన్నీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు అవుతుంది. ఈ సమస్య కాస్త పక్కదారి పట్టించినట్టు అవుతుంది.