SAKSHITHA NEWS

ఉపాధి వేటలో వలస బాట శ్రీకాకుళం జిల్లా ప్రజలు

శ్రీకాకుళం జిల్లా లో ఉన్న ఊరిలో ఉపాధి కరవై చాలామంది వలస పోతున్నారు. భూములున్నా నీటి వనరులు లేక, కరవు కాటకాలతో రైతులు సైతం ఊళ్లు వదిలి వెళ్తున్నారు. ఎక్కువ శ్రీకాకుళం నుండి మరియు కోస్తాంధ్ర… ప్రాంతాల తేడాలు లేకుండా అన్నిచోట్ల నుంచీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా…

జీవనోపాధి, ఉన్నత విద్య కోసం దేశంలో చాలామంది స్వగ్రామాలు వదిలి వలస బాట పడుతున్నారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశం దొరికితే పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా వెళ్తున్నారు. ఇలాంటి వలసలు జాతీయ స్థాయిలో 28.9శాతంగా ఉన్నాయని కేంద్ర గణాంకాల శాఖ గతంలో వెల్లడించింది. మరోవైపు, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ఏకంగా 90 లక్షల మంది గ్రామాల నుంచి పట్టణాలకు వలస పోతున్నారు. గతంలో లాక్‌డౌన్‌ సమయంలో ఓ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా అయిదున్నర కోట్ల మంది వలస కార్మికులు నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు.

వారిలో 5.1 కోట్ల మంది పేర్లు కనీసం సంక్షేమ బోర్డులో నమోదు కాలేదని వెల్లడైంది. దేశవ్యాప్తంగా వలస కూలీల దినసరి వేతనం కనీస స్థాయికన్నా తక్కువగానే ఉంది. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకొని వలస వెళ్తున్న శ్రామికులు మోసాల బారిన పడటం పెద్ద సమస్యగా మారింది. కొంతమంది వలస వెళ్లినచోట డబ్బులు అందక అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. మరికొంతమంది ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. గల్ఫ్‌ దేశాల్లో గత ఆరేళ్లలో 38,748 భారతీయ వలస కార్మికులు మరణించగా, వారిలో అయిదు వందల మంది తెలుగు రాష్ట్రాల కార్మికులు ఉన్నారని లోక్‌సభకు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

చదువులకు ఆటంకం
ఎంతోకొంత నైపుణ్యాలు కలిగినవారు, నైపుణ్యం లేని కార్మికులు కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతర్, ఒమన్, యూఏఈ లాంటి దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. ఒక సర్వే ప్రకారం దేశంలో సుమారు 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. వారిలో 22 లక్షల మంది ఉత్తరాంధ్రకు చెందినవారే. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి సుమారు 15 లక్షల మంది వలస వెళ్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. శ్రీకాకుళంలో చేపల వేటపై ఆధారపడే 80 వేల కుటుంబాల వారు ఏటా ఏప్రిల్‌ రాగానే వలస బాట పడుతున్నారు.

రాయలసీమ ప్రజలు గుంటూరు ప్రాంతంలో మిరప ఏరడానికి, తెలంగాణలోని సంగారెడ్డి, జహీరాబాద్‌ ప్రాంతంలో పత్తి తీసేందుకు వెళ్తున్నారు. అలా వెళ్లినవారు ఆరేడు నెలలకుగాని తిరిగి ఇంటి ముఖం చూడటం లేదు. వలస వెళ్లిన ప్రాంతాల్లో పలువురు వివిధ ప్రమాదాల బారిన పడి మరణిస్తుండటం విషాదకరం. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వలస వెళ్తే, పిల్లలను ఇంటి వద్ద విడిచి పెడుతున్నారు. వృద్ధులు ఇంటికి కాపలాగా ఉండిపోతున్నారు. దీంతో పిల్లల చదువులు ముందుకు సాగడం లేదు. తల్లిదండ్రులు వలస వెళ్తే కొందరు పిల్లలు కూడా వారి వెంట వెళ్తున్నారు. ఇలాంటి చిన్నారుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి నెలకొంటోంది.

సాధారణంగా వీరి కోసం ప్రభుత్వాలు సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయాలి. గతంలో ఇలాంటివి ఏర్పాటు చేసినా మొక్కుబడిగా నిర్వహించారు. దీంతో విద్యార్థులు అక్కడ ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏపీలో కూటమి ప్రభుత్వం సీజనల్‌ హాస్టళ్ల ఏర్పాటుపై దృష్టి సారించడం గమనార్హం. వలస జిల్లాల్లో స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు, పొదుపు సంఘాల సభ్యులకు సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టారు.

అక్రమాలకు తావులేకుండా…
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం సత్ఫలితాలను ఇవ్వడం లేదని, వేతనాలు గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన పనులు గుర్తించాలి. కూలీలకు గిట్టుబాటు అయ్యేలా వేతనాలు చెల్లించడం వంటి చర్యలు చేపట్టాలి. అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిజమైన కూలీలకు న్యాయం జరిగేలా చూడాలి. ఇందుకోసం అధికారులు పకడ్బందీగా పర్యవేక్షణ చేపట్టాలి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వలసల నివారణకు పలు కార్యక్రమాలు చేపట్టాలి. పేద ప్రజలకు స్వగ్రామాల్లోనే ఉపాధి మార్గాలు చూపాలి. అప్పుడే వలసలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.


SAKSHITHA NEWS