వ్యర్థాల నుంచి సంపద సృష్టి నమూనాగా జిందాల్ పవర్ ప్రాజెక్టు: నారాయణ, ప్రత్తిపాటి
జిందాల్ పవర్ ప్రాజెక్టును సందర్శించిన నారాయణ, ప్రత్తిపాటి, పట్టాభిరామ్
రాష్ట్రంలో వ్యర్థాల నుంచి సంపదసృష్టిలో యడ్లపాడు పవర్ ప్రాజెక్టు నమూనా ఆదర్శంగా నిలవబోతోందన్నారు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. చెత్త పన్ను వేయడం తప్ప రాష్ట్రంలో చెత్తను ఎలా శుద్ధి చేయాలో తెలియని గత పాలకులకూ ఇదో పాఠమన్నారు. యడ్లపాడు మండలం కొత్తపల్లి వద్ద జిందాల్ పవర్ ప్రాజెక్టును మంగళవారం వారు ముగ్గురూ పరిశీలించారు. వ్యర్థాలతో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. గంటకు 16 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసే ఈ ప్రాజెక్టులో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ నుంచి సేకరించి పొడి చెత్తను వినియోగిస్తారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నారాయణ జిందాల్ పవర్ ప్రాజెక్టు వల్ల విజయవాడ, గుంటూరు , మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లిలో వచ్చే ఘన వ్యర్థాలన్నీ ఈ ప్లాంట్‌కు వస్తున్నాయని, కాల్చి తర్వాత విద్యుదుత్పత్తి చేస్తున్నారన్నారు. విశాఖలోని ప్లాంట్‌కు 50 కి.మీ. పరిధిలో ఉన్న వ్యర్థాలు తరలి వస్తాయన్నారు. వీటన్నింటికి సం బంధించి తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే సింగపూర్, టోక్యోలో అధ్యయనం చేసి ఈ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.13 ఉమ్మడి జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అయితే విశాఖ, గుంటూరు జిల్లాల్లో భూముల లభ్యతతో వెంటనే ప్రారంభించామని అన్నారు.
తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం మొదలు పెట్టిన 2 ప్లాంట్ల తో పాటు మిగిలినచోట్ల భూసేకరణను కూడా గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు సరాసరి 6,890 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందన్న మంత్రి నారాయణ యడ్లపాడు, విశాఖ 2 ప్లాంట్ల ద్వారా 2,160 టన్నులు శుద్ధి జరు గుతోందన్నారు. దాదాపు 31% చెత్త ఈ ప్లాంట్లకు వచ్చి బర్న్ అయిపోతుందన్నారు. త్వరలో కాకినాడ, నెల్లూరులోనూ ప్లాంట్లు పెడుతున్నామని అన్నారు. అవి అందివస్తే రాష్ట్రంలో 52% అంటే 3,600 టన్నులు, కడప, కర్నూలు, అనంత పురం మధ్య ప్లాంట్ అందుబాటులోకి వస్తే 70% వరకు వ్యర్థాల సమస్య తీరుతుందన్నారు. వైకాపా 5అధ్వాన్నపు పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింద ని, దాంట్లో దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నులు తొలగించామన్నారు. మిగతా 40 లక్షల మెట్రికల్ టన్నుల వ్యర్థాలను కూడా వచ్చే అక్టోబర్ 2 నాటికి తొలగించాలని సీఎం ఆదేశించారన్నారు. అమృత్-2 కింద రూ.8,500 కోట్ల ప్రాజెక్టు ఇస్తే దాంట్లో కేంద్రం 37% గ్రాంట్ ఇస్తుందని, మిగిలి నది రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వంలో కేంద్రం తొలివిడత నిధులు ఇచ్చినా మ్యాచింగ్ ఫండింగ్ లేక ఆ పనులన్నీ ఆగిపోయాయని తెలిపారు. అమృత్ పనులు చేసి ఉంటే రాష్ట్రంలో 80% మున్సిపాలిటీలు చక్కగా అయ్యేవన్నారు. అన్ని మున్సిపాలిటీలకు సురక్షిత మంచినీరు అందించాలని 2019 ఫిబ్రవరిలో రూ.5,350 కోట్లతో మొదలు పెట్టిన ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రాజెక్టునూ జగన్ అలానే అటకెక్కించారన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే 4 ఏళ్లకు ఇచ్చారని, త్వరలోనే వాటికి కూడా టెండర్లు పిలవబోతున్నామని వెల్లడించారు.
అమృత్-2, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పొడి, తడి వ్యర్థాలు, తాగునీరు, రహదారులు వినియోగంలోకి వస్తాయన్నారు. అనంతరం మాట్లాడిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి రాష్ట్రంలోనే ఇది ప్రతిష్ఠాత్మక జిందాల్ పవర్ ప్రాజెక్టు అని, వ్యర్థాల నిర్వహణతో పాటు 16 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారని తెలిపారు. రూ.340 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించామని తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థతో పాటు చిలకలూరిపేట, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీల నుంచి పొడి, తడి వ్యర్థాలు వేరుచేసి వాటి ద్వారా విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ ఇది అని పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్‌తో ప్రజలకు ఎంతో మేలని, వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోకుండా చేయవచ్చని, ప్రజలు అనారోగ్యం బారినపడకుండా కాపాడ వచ్చని చెప్పారు. ప్రజలతో పాటు పరిశ్రమలకు అవసరమైన విద్యుత్‌ను ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి మాట్లాడుతూ ప్లాంట్ ఏర్పాటు లో సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రి నారాయణ, ప్రత్తిపాటి కృషి ఎంతో ఉందన్నారు. విదేశీ సాంకేతికను పరిశీలించాకే నారాయణ ప్లాంట్ నిర్మాణం చేయించారన్నారు. చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్లాంట్ నిర్వహణ చేస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను మన నెత్తిన వేసి వెళ్లిందని మండిపడ్డారు.