వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో బిగ్ షాక్
ద్వారంపూడి కుటుంబానికి చెందిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు
నోటీసులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి
ఆగస్టు 6న గురజనాపల్లిలోని రొయ్యలశుద్ధి పరిశ్రమను మూసివేయించిన అధికారులు
వైసీపీ సీనియర్ నేత, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూటమి సర్కార్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. ద్వారంపూడి కుటుంబానికి చెందిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యలశుద్ధి పరిశ్రమలో ఉల్లంఘనలు గుర్తించి ఈ ఏడాది ఆగస్టు 6న అధికారులు దానిని మూసివేయించారు.
తాజాగా, ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలోని వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరిట ఉన్న రెండో యూనిట్‌ను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం నిన్న ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించారు. ఆ అతిక్రమణలను సరిదిద్దుకోవాలని పీసీబీ నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయమని (క్లోజింగ్ ఆర్డర్) ఉత్తర్వులు ఇచ్చారు.