మాల సోదరులు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో బహిరంగ చర్చకు రావాలి
రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయం
మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అందకనే ఎస్సీ వర్గీకరణ కోరుతున్నాము.
టిఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందాలన్నదే అంబేద్కర్ ఆశయమని దానికి తూట్లు పొడిచేలా మాల సోదరులు వ్యవహరించడం సరికాదని టిఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ అన్నారు. సోమవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన టిఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే వారికి రిజర్వేషన్లు అందడం లేదని అందుకే వారంతా ఎస్సీ వర్గీకరణ కోరుతున్నారని అన్నారు. అసలు మాల సోదరులు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని, బహిరంగ చర్చకు వచ్చి సమాధానం ఇవ్వాలన్నారు. మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదని వ్యక్తిగత కక్షలతో మాల సోదరులు వ్యవహరించి ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడడం సరికాదన్నారు. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఎలా విడిపోతారో అలాగే మాదిగలు విడిపోవాలనుకుంటున్నారని మాదిగలకు మాలలు ఎప్పుడు శత్రువులు కాదన్నారు. ఏ ఒక్కరి వలన ఎస్సీ వర్గీకరణ జరగడం లేదని 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది మాదిగ అమరవీరుల త్యాగ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధించడం జరుగుతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని హామీ ఇచ్చి నేటి వరకు చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. టిఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగడుపుల సూరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు జానయ్యలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల మాదిగల పోరాటమని 25 సంవత్సరాల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వెంటనే వర్గీకరణ చేపట్టాలన్నారు. టిఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు నాయకత్వంలో తమంతా ఎస్సి వర్గీకరణ అమలు చేసేవరకు పోరాడుతామన్నారు. టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రావణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డు సైదమ్మ, టిఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షులు పిడమర్తి మధు, టీఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ, టిఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు మల్సూర్, ఆత్మకూర్ ఎస్ మండల అధ్యక్షులు బొల్లె అశోక్, మండల ఉపాధ్యక్షులు సూరారపు నాగయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మీసాల గౌతం, గ్రామ శాఖ అధ్యక్షులు గంగారపు సాయి రామ్, పొడపంగి విగ్నేష్, ములకలపల్లి శ్రీను, ములకలపల్లి అంజయ్య, వేదాసు ధనమ్మ, బొడ్డు వెంకటమ్మ, యాతాకుల సంధ్య తదితరులు ఉన్నారు.