పంట కోత పరిశీలించి…పొలం గట్టున రైతులతో కూర్చొని పంట వివరాలు ఆరా
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
వరి పంట కోతను పరిశీలించి, పొలం గట్టున రైతులతో కూర్చొని పంట దిగుబడి, వ్యవసాయ వివరాలను, సమస్యల గురించి రైతులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడి ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తల్లాడ మండల కేంద్రంలో పర్యటించి మంగాపురం రోడ్డులో ఉన్న తమ్మిశెట్టి లక్ష్మీనర్సయ్య రైతు పొలంలో జరుగుతున్న వరి పంట కోతలను పరిశీలించి, అక్కడున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని వరి కోతల మిషన్ పై కూర్చొని వరి కోతలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ధాన్యం పంట విస్తీర్ణం, వస్తున్న దిగుబడి, కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది, ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నాయా, రైస్ మిల్లర్ల దగ్గర ఏదైనా కోతలు జరుగు తున్నాయా, అధికారుల స్పందన వంటి వివరాలను తెలుసు కున్నారు. వరి కోతల యంత్రం తమిళనాడు నుంచి వచ్చిందని తెలుసుకున్న కలెక్టర్ గంట సమయానికి ఎంత విస్తీర్ణంలో పంట కోత జరుగుతుంది, ఎంత డబ్బులు అవుతాయి వంటి వివరాలను ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రైతు పొలంలో గట్టు పై రైతులతో కూర్చొని మాట్లాడారు. సాగు నీటి వసతి ఎలా ఉంది, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, గ్రామాలలో త్రాగు నీటి సరఫరా సరిగా జరుగుతుందా వంటి అంశాలను ఆరా తీశారు. ధరణి కి సంబంధించి సమస్యలు ఉన్నాయా అని అడిగి, కలెక్టరేట్ లో ధరణి సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, దరఖాస్తుల సమర్పణ విషయంలో వారి సహకారం తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అవసరమైన వసతులు కల్పిస్తుందని, ప్రైవేట్ కు దీటుగా విద్యా బోధన చేస్తున్నామని, ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం ఉంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా తల్లాడ మండల వ్యవసాయ అధికారి ఎండి. తాజోద్దీన్, వ్యవసాయ విస్తరణ అధికారులు బి. మురళీకృష్ణ, బి. సాయి కుమార్, జి. శివకుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.