SAKSHITHA NEWS

సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!!

నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా.. సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేకు సంబంధించి మొత్తం 56 ప్రశ్నలు తయారుచేశారు.

ప్రతీ కుటుంబం నుంచి ఆ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. అయితే.. అసలు ఈ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు.. సర్వే ఎలా చేస్తారు.. దీని ఉద్దేశం ఏంటీ.. ఓసారి చూద్దాం.

1.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీసుకున్న అప్పులపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతారు. గత ఐదేళ్ల కాలంలో ఏమైనా అప్పులు తీసుకున్నారా.. ఎందుకు తీసుకున్నారు.. ఎక్కడి నుంచి తీసుకున్నారు అనే ప్రశ్నలు అడగనున్నారు. వీటికి వివరంగా సమాధానం చెప్పాలి. బ్యాంకులు, ఎస్‌హెచ్‌జీ నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నారా అనే వివరాలను చెప్పాలని ప్రభుత్వం కోరింది.

2.గత ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారా? ఆ పథకాల ఏంటి? వీటి వివరాలు కూడా సేకరిస్తారు. కచ్చితమైన సమాచారం సర్వే చేసే వారికి ఇవ్వాలి.

3.కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా ప్రశ్నలు ఉన్నాయి. ద్విచక్రవాహనం, కారు, వాషింగ్‌ మిషన్, ఫ్రిజ్, ఏసీ, టీవీ, స్మార్ట్‌ఫోన్‌ ఇలా మొత్తం 18 రకాల వివరాలు చెప్పాల్సి ఉంటుంది.

4.ఇంటికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. ఇల్లు ఎన్ని గజాల్లో.. ఏ ప్రాంతంలో ఉంది? మొత్తం గదులెన్ని.. బాత్‌రూం, మరుగుదొడ్డి ఉన్నాయా ఇలాంటి వివరాలన్నీ చెప్పాలి. భూమికి సంబంధించి.. ఎంత భూమి, ఎన్ని ఎకరాలు, అది పట్టా భూమా? ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్‌ ల్యాండా, పట్టాలేని అటవీ భూమా.. ఈ వివరాలు స్పష్టంగా చెప్పాలి.

5.ఈ సమగ్ర కుటుంబ సర్వేలో యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేసుకుంటారు. దీంతోపాటు కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబరు, వారుచేసే పని, ఉద్యోగ వివరాలను సేకరిస్తారు.

6.తెలంగాణలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే చేయడానికి శాసనసభ తీర్మానం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

7.ఈ సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అవకాశాలు మెరుగుపరిచేందుకు, అన్నివర్గాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సర్వేకు ప్రణాళి కశాఖ నోడల్‌ విభాగంగా వ్యవహరించనుంది.

8.తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 వేల మంది ఈ సర్వేలో పాల్గొంటారు. వీరిలో విద్యాశాఖ నుంచి 48,229 మంది ఉన్నారు. టీచర్లే కాకుండా ఇతర కేటగిరీల ఉద్యోగులను కూడా సర్వేకు వినియోగించే అవకాశం ఉంది.

9.జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. జిల్లా, మండల నోడల్‌ అధికారులు.. ఎన్యూమరేషన్‌ బ్లాక్‌ల గుర్తింపు, సర్వే చేసేవారి నియామకం, ఇళ్ల జాబితా, డేటా ఎంట్రీ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.

10.ఈ సర్వే చేయడానికి గ్రామాల్లోని ఇళ్లను ఈబీలుగా విభజిస్తారు. ఒక గ్రామంలో కనీసం 175 కుటుంబాలుంటే మొత్తంగా దాన్ని ఒకే ఈబీగా నిర్ణయించి ఒక సర్వే అధికారికి అప్పగిస్తారు. అంతకన్నా ఎక్కువ ఉంటే.. వాటిని చిన్న యూనిట్లుగా.. అప్పగిస్తారు. నవంబర్ నెల ఎండింగ్ వరకు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


SAKSHITHA NEWS