SAKSHITHA NEWS

దైవ దర్శనాలకు అందరూ సమానమే

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై టిటిడి పునరాలోచించుకోవాలి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలంగాణ ఎమ్మెల్యే సిఫార్సు లేఖల అంశంపై ప్రభుత్వంతో చర్చించి పునరాలోచించాలని
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” అన్నారు.
శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ అంశంపై స్పందించారు. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల అంశంలో టిటిడి పెద్ద మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దైవ దర్శనాలు భక్తులకు అందరికీ సమానమేనని ప్రాంతాలవారీగా విడదీసి చూడకుండా అందరమూ ఒకటేనన్న భావనతో ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం అందరికీ కల్పించాల్సిన బాధ్యత టిటిడి బోర్డుపైనే ప్రధానంగా ఉందని చెప్పారు. టిటిడి స్వయం ప్రతిపత్తి పై ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల భక్తి మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.

ఎమ్మెల్యేల లేఖలను తీసుకోవడం ద్వారా దేవస్థానం పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొన్నారు. తెలంగాణలో యాదగిరిగుట్ట, భద్రాచలం లాంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఆలయ నిర్వాహకులు అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ పాటిస్తారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అందరికీ ఆరాధ్య దైవం అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ విడిపోయినప్పటికీ అందరూ తెలుగువారిగా కలిసిమెలిసి ఉన్నారని గుర్తు చేశారు. తిరుమలలో దైవదర్శనాలకు ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను అంగీకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ కోరారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు విశ్వం తదితరులు ఉన్నారు..


SAKSHITHA NEWS